ఫార్చ్యూన్లో ఒకే ఒక్క భారతీయుడు
దేశ రాజధాని నగరంలో కాలుష్యభూతాన్ని తరిమికొట్టడంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (47) చేపట్టిన చర్యలు ఆయన్ని ప్రపంచ గొప్ప నాయకులలో ఏకైక భారతీయ నాయకుడిగా నిలిపాయి. ఫార్చ్యూన్ పత్రిక ప్రకటించిన మూడో వార్షిక అవార్డులో కేజ్రీవాల్ ఈ ఘనతను సాధించారు. ప్రపంచ గొప్పనాయకుల జాబితాలో 42వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెల్లడించిన మూడో వార్షిక వరల్డ్ 50 గ్రేటెస్ట్ లీడర్ల జాబితాలో ఒక్క కేజ్రీవాల్‌కు మాత్రమే స్థానం లభించింది. దేశ రాజధాని నగరం కాలుష్య నియంత్రణలో సీఎం ప్రవేశపెట్టిన సరి-బేసి వాహనాల పద్ధతి తమకు నచ్చిందని పత్రిక తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, ప్రభుత్వం, దాతృత్వం, కళల లాంటి వివిధరంగాల్లో ప్రముఖంగా, ఆదర్శవంతంగా నిలిచిన వారి పేర్లతో ఈ జాబితాను ఫార్చ్యూన్ ప్రకటిస్తుంది. అమెరికా వ్యాపార దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, బెజోస్ వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచారు. జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రెండు, ఆంగ్‌సాన్ సూకీ మూడు, పోప్ ఫ్రాన్సిస్ నాలుగో స్థానాలను దక్కించుకున్నారు. ఇక భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గె 50 వ ర్యాంకు సాధించారు. అటు కేజ్రీవాల్ తో పాటు దక్షిణ కరొలినాకు చెందిన భారతీయ అమెరికన్ గవర్నర్ నిక్కి హీలే 17వ స్థానంలో ఉండగా, హిందూ అమెరికన్ రేషం సౌజని 20వ ర్యాంకు సాధించారు.