నలుగురు కుమారులున్నా అంతిమయాత్రలో అనాథే
వేములపల్లి (నల్లగొండ): ఆమెకు నలుగురు కుమారులు... రెక్కలు ముక్కలు చేసుకుని విద్యాబుద్ధులు చెప్పించింది. అందరికీ పెళ్లిళ్లు చేసి.. తన బాధ్యతను నెరవేర్చింది. కానీ అవసాన దశలో ఆ తల్లిని కుమారులు పట్టించుకోలేదు సరి కదా... ఆఖరికి కాటికి సాగనంపేందుకు కూడా ముందుకు రాలేదు. చివరకు గ్రామస్తులే ఆ తంతును పూర్తి చేశారు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంటలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... సోమ మట్టమ్మ (80)కు నలుగురు కుమారులు. వీరిలో ఇద్దరు కుమారులు సూర్యాపేటలో, ఓ కుమారుడు తిప్పర్తిలో, మరో కుమారుడు రావులపెంటలోనే ఉంటున్నారు.
కుమారులు ఎవరు పట్టించుకోకపోవడంతో మట్టమ్మ గ్రామంలో దొరికిన పనిచేసుకుంటూ ప్రతి నెలా వచ్చే వృద్ధాప్య పింఛనుతోనే జీవనం సాగించేది. రాత్రివేళ గ్రామశివారులోని చర్చిలో ఉంటుంది. ఇటీవల మట్టమ్మ నకిరేకల్ మండలం బొప్పారం గ్రామంలో ఉంటున్న తన చెల్లి అచ్చమ్మ వద్దకు వెళ్లింది. గురువారం రాత్రి మట్టమ్మ అక్కడే మరణించింది. విషయాన్ని బంధువులు మట్టమ్మ కుమారులకు తెలియజేశారు. శుక్రవారం మృతదేహాన్ని రావులపెంట గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలోనే ఉంటున్న చిన్న కుమారుడు మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకురావద్దని చెప్పాడు. దీంతో చర్చి వద్దకు తరలించారు. బంధువులు, గ్రామస్తులు మట్టమ్మ కుమారులకు ఫోన్లో ఒత్తిడిచేయడంతో గ్రామానికి చేరుకున్నారు. అయినప్పటికీ తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. దీంతో చర్చి నిర్వాహకురాలు రూసమ్మ, మృతురాలి బంధువుల సహకారంతో క్రైస్తవ మతాచారం ప్రకారం మట్టమ్మ అంత్యక్రియలు నిర్వహించారు.