ఎమ్మెల్యే సహా తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు
స్కై బార్ ఫలితం
పరారీలో రౌడీ షీటర్ సోమశేఖర గౌడ
అవసరమైతే ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తాం : శరత్ చంద్ర
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఇక్కడి యూబీ సిటీలోని స్కై బార్లో పోలీసులు, బార్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బాగలకోటె జిల్లా హునగుంద ఎమ్మెల్యే (కాంగ్రెస్) విజయానంద కాశప్పనవర్ సహా తొమ్మిది మందిపై పోలీసులు గురువారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విధులకు ఆటంకం కల్పించారని, నోటికొచ్చినట్లు దూషించారని, దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 353, 504 కింద కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
ఎమ్మెల్యేతో పాటు ఉన్న రౌడీ షీటర్ సోమశేఖర గౌడ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు సంయుక్త పోలీసు కమిషనర్ కేవీ. శరత్ చంద్ర తెలిపారు. అతనిపై గతంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి అవసరమైతే ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు.
కాగా మంగళవారం రాత్రి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బార్‌కు వెళ్లి దౌర్జన్యం చేసి, ఒకటిన్నర గంటల వ రకు పూటుగా మద్యం సేవించి, నృత్యాలు చేశారు. సమయం మించి పోయినా బారును తెరిచి ఉంచడంతో పోలీసు కానిస్టేబుల్ కిరణ్ కుమార్ వీడియో చిత్రీకరణ చేస్తుండగా ఎమ్మెల్యేతో పాటు విజయానంద దాడికి పాల్పడ్డారు. మరో వైపు పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో ఎమ్మెల్యే ఇక్కడి సిటీ కోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
బహిష్కరణ
దౌర్జన్యానికి పాల్పడిన సోమశేఖర గౌడను కాంగ్రెస్ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఎమ్మెల్యే విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఎవరైనా సరే, చట్టాన్ని అతిక్రమించడానికి వీల్లేదని ఆయన అన్నారు.