నరేంద్రమోడీకి సంపూర్ణ మద్దతు
బీజేపీ మా మాతృ పార్టీ
= పార్టీలోకి తిరిగి రావాలని శ్రీరాములును బీజీపీ నేతలు ఆహ్వానించారు
= ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
= కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి
సాక్షి, బళ్లారి : గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. దివంగత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన ఇనుము సేకరణ కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ ఇండియా- రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశప్రజలందరూ నరేంద్ర మోడీవైపు చూస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన దేశానికి ప్రధాని కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. బీజేపీ తమ మాతృ పార్టీ అని, తాము ముందు నుంచి ఆ పార్టీలో పని చేశామని గుర్తు చేశారు. బీజేపీలోకి తిరిగి రావాలని బీఎస్ఆర్సీపీ అధినేత బీ.శ్రీరాములును ఆ పార్టీ నేతలు ఆహ్వానించారన్నారు. ఆయన తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో బసవరాజేశ్వరీ స్కూల్ అండ్ కాలేజీ చైర్మన్ డాక్టర్ మహిపాల్, మాజీ కార్పొరేటర్ కేఎస్.దివాకర్ పాల్గొన్నారు.