పఠాన్‌కోట్ దాడి; పాక్‌లో అరెస్ట్‌లు
ఇస్లామాబాద్: భారత్ హెచ్చరికలు, అమెరికా వంటి అగ్రదేశాల ఒత్తిళ్లు పనిచేశాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి ఘటనపై పాకిస్తాన్ అనూహ్యంగా స్పందించింది. పఠాన్‌కోట్ దాడి సూత్రధారులను పట్టుకునేందుకు పాక్ అధికారులు తమ దేశాంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేయించారు. సోమవారం కొందరు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.
పాక్‌లోని గుజ్రన్‌వాలా, జెలుమ్, బహవల్పూర్ జిల్లాల్లో దాడులు జరిగాయి. అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేశారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో వీరికి సంబంధముందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడి ఘటనపై విచారణకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటలిజెన్స్ బ్యూరో, ఐఎస్ఐ, మిలటరీ ఇంటలిజెన్స్, ఫెడరల్ ఇంటలిజెన్స్ ఏజన్సీ, పోలీసులు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
పఠాన్‌కోట్ దాడి సూత్రధారులపై పాక్ చర్యలు తీసుకోకుంటే ఇరు దేశాల విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శుల సమావేశం జరగదని భారత్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ హెచ్చరించారు. ఈ విషయంపై అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి కూడా పాక్ ప్రధానితో మాట్లాడారు.