హర్యానాలో రెండు తలల దేవుడు పుట్టాడోచ్!
హర్యానా సోనేపత్ లోని ఒక హాస్పిటల్ లో అరుదైన అవిభక్త కవలలు జన్మించారు. రెండు తలలు, ఒకే శరీరంతో ఈ శిశువు పుట్టింది. పైకి ఒకే మొండెంగా కనిపించినా శిశువుకి వేర్వేరు మెడలు, వేర్వేరు వెన్నెముకలు ఉన్నాయి.
ఇలాంటి కవలలను థోరాకోఫాగస్ కవలలు అంటారు. వీరికి ఛాతీ నుంచి అవయవాల వరకూ కలిసిపోయి ఉంటాయి. ఇలాంటి శిశువులు దాదాపు రెండు లక్షల మందిలో ఒకరు ఉంటారని కానుపు చేసిన డాక్టర్ శిఖా మాలిక్ అన్నారు.
ఈ పిల్లల తల్లి దినసరి కూలీ. ఆమె గర్భిణీగా ఉన్నపుడు అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయనందుకు ముందుగా విషయం తెలియలేదు. పాతికేళ్లు వచ్చే సరికి ఇలాంటి పిల్లలు బతికే చాన్సు కేవలం అయిదు శాతం మాత్రమే ఉంటుందని వైద్యులు అంటున్నారు.
అయితే మ్యాజిక్కులే తప్ప లాజిక్కులను నమ్మని మన దేశంలో ఈ అవిభక్త కవలలను దేవుళ్లుగా పూజించి, పసుపూ కుంకుమలు చల్లుతూ పోతే మాత్రం పాతికేళ్లు కూడా బతకడం కష్టమంటున్నారు హేతువాదులు. ఇప్పటికే చాలా మంది రెండు తలల దేవుడు పుట్టాడోచ్ అంటూ ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారట.