'అక్రమ' అనుమానం.. కన్నతల్లిని కడతేర్చిన కొడుకులు
సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన ఇది. నలుగురు కొడుకులు కలిసి కన్నతల్లిని కడతేర్చారు. ఈ దారుణ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసాలో చోటుచేసుకుంది. లక్ష్మీబాయి (55) అనే మహిళ తన స్వగ్రామం నుంచి ఉపాధి కోసం వచ్చి భైంసాలో అద్దెకు ఉంటోంది. ఆమెకు నలుగురు కొడుకులున్నారు. వాళ్లంతా ఒక శుభ కార్యానికి వెళ్లి తిరిగి వచ్చారు. తర్వాత తల్లిని హతమార్చారు. అయితే.. అందుకు వాళ్లు చెబుతున్న కారణం దారుణంగా ఉంది.
తమ తల్లికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై తమకు చాలాకాలంగా అనుమానం ఉన్నా, ఇప్పుడు మాత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో బండరాళ్లు, కర్రలతో దాడిచేసి చంపామని చెబుతున్నారు. కానీ తమలో ఇద్దరం మాత్రమే చంపామని, మిగిలిన ఇద్దరికీ దీంతో సంబంధం లేదని వాళ్లంటున్నారు. దీంతో పోలీసులు ఇద్దరు కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత గానీ ఈ సంఘటనపై తామేమీ చెప్పలేమని పోలీసులు అంటున్నారు.
లక్ష్మీబాయి భర్త గతంలోనే మరణించగా, ఆమె కొడుకులు నలుగురూ వేర్వేరు చోట్ల ఉపాధి పొందుతున్నారు. వాళ్లలో ఇద్దరికి పెళ్లయింది. ఒకరు ట్రాక్టర్, మరొకరు ఆటో నడుపుకొంటున్నారు. మిగిలిన ఇద్దరూ కూలిపనులు చేసుకుంటారు.