Sony Six channel
-
India vs Zimbabwe 2nd ODI: భారత్ జోరుకు తిరుగుందా!
హరారే: జింబాబ్వే గడ్డపై అలవోక విజయంతో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు అదే జోరుతో సిరీస్‌పై కన్నేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే ఇక్కడే కప్ గెలవాలనే పట్టుదలతో రాహుల్ సేన బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌తో భారీ స్కోర్లను ఛేదించి మరీ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే జట్టు... వారాల వ్యవధిలోనే భారత్ ఆల్‌రౌండ్ దెబ్బకు విలవిల్లాడింది. ఇప్పుడు సిరీస్‌లో నిలిచేందుకో, ఈ మ్యాచ్ గెలిచేందుకో కాదు... భారత్ ధాటిని ఎదుర్కోవాలని లక్ష్యంతోనే జింబా బ్వే రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. టీమిండియా సీమర్లను ఆరంభ ఓవర్లలో ఎదుర్కొంటే... గెలుపు, భా రీస్కోరు సంగతి అటుంచి కనీసం 50 ఓవర్ల కోటా అయినా ఆడుకోవచ్చని జింబాబ్వే ఆశిస్తోంది. ఆకాశమే హద్దుగా భారత్ భారత్ జోరుకు ఆకాశమే హద్దు! ముఖ్యంగా ఓపెనింగ్ జోడి. ధావన్–శుబ్‌మన్ గిల్ కొన్నాళ్లుగా తమకెదురైన ప్రతీ ప్రత్యర్థిని, ప్రతీ బౌలర్‌ను అలవోకగా ఎదుర్కొంటున్నారు. సులువుగా పరుగులు, భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నారు. మిడిలార్డర్లో రాహుల్ తన పునరాగమనాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతుండగా, సంజు సామ్సన్, దీపక్ హుడా సీనియర్ల గైర్హాజరీలో సత్తా చాటుకుంటున్నారు. బౌలింగ్ విభాగం కూడా ఆతిథ్య జట్టు కంటే పటిష్టంగా ఉంది. బరిలోకి దిగి చాన్నాళ్లయినా... దీపక్ చహర్ తొలి ఓవర్‌నుంచే లయ అందుకున్నాడు. గత మ్యాచ్‌లో అతను టాపార్డర్‌ను కూల్చిన తీరు అద్భుతం. స్పిన్నర్ అక్షర్, సీమర్ ప్రసిధ్ కూడా వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ఒత్తిడిలో జింబాబ్వే పటిష్టమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు జింబాబ్వే ఆపసోపాలు పడుతోంది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో తేలిపోతోంది. తొలి వన్డే ఫలితాన్ని పరిశీలిస్తే ఆతిథ్య జట్టు సిరీస్‌ను ఆఖరి దాకా తీసుకొ చ్చే అవకాశమైతే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎటొచ్చీ ఓటమి అంతరాన్ని తగ్గించడం, లేదంటే పరువు నిలుపుకొనే పోరాటంపైనే జింబాబ్వే దృష్టి పెట్టింది. ఇన్నోసెంట్ కైయా, మరుమని, వెస్లీ బాధ్యత కనబరిస్తే మంచి స్కోరు చేయవచ్చు. పిచ్–వాతావరణం తొలి వన్డే ఆడిన పిచే! మ్యాచ్ ఆరంభంలో కొత్తబంతి సీమర్లు చెలరేగొచ్చు. తర్వాత బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఆటకు అనుకూల వాతవరణం ఉంది. వాన ముప్పే లేదు. జట్లు (అంచనా) భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ధావన్, గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ సామ్సన్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్. జింబాబ్వే: రెగిస్ చకాబ్వా (కెప్టెన్), కైయా, మరుమని, సియాన్ విలియమ్స్, వెస్లీ మధెవెర్, సికందర్ రజా, రియాన్ బర్ల్, ల్యూక్ జాంగ్వే, ఇవాన్స్, విక్టర్, రిచర్డ్. -
డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రేక్షకుల ఆదరణ
సాక్షి, హైదరాబాద్: భారీ పంచ్‌లు, ముష్టిఘాతాలకు నెలవైన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రేక్షకుల నుంచి అమితాదరణను పొందుతోంది. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రెజిల్‌మానియా 35 టోర్నమెంట్ పెద్ద సంఖ్యలో అభిమానులను ఆకర్షించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ స్టార్లు తలపడిన ఈ పోటీలకు ప్రేక్షక లోకం కళ్లప్పగించింది. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలను మెట్‌లైఫ్ స్టాండ్స్ నుంచి దాదాపు 82,000కు పైగా అభిమానుల ప్రత్యక్షంగా వీక్షించారు. ఇదే కాకుండా సోనీ టెన్–1, సోనీ టెన్–3, సోనీ సిక్స్ చానళ్ల ద్వారా భారత్‌లోని అభిమానులు ఈ క్రీడా వినోదాన్ని ఆస్వాదించారు. మెగా ఫ్యాన్స్ కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలోని పీవీఆర్ మాల్స్‌లో ఈ పోటీలను భారీ స్క్రీన్లపై ప్రదర్శించారు. చరిత్రాత్మకమైన ఈ రెజిల్‌మానియా తొలిసారిగా మహిళల మ్యాచ్‌లను నిర్వహించింది. -
నేటి నుంచి నగరంలో ఎన్బీఏ షో
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోని ప్రతిష్టాత్మక బాస్కెట్ బాల్ లీగ్ ఎన్బీఏ (నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్) ఇప్పుడు భారత్‌లో కూడా తమ ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశంలోని నాలుగు నగరాల్లో కాలేజీ విద్యార్థుల కోసం ఎన్బీఏ జామ్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. సోనీ సిక్స్ చానల్ దీనికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఎన్బీఏ ఇండియా సీనియర్ డెరైక్టర్ ఆకాశ్ జైన్ ఈ వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీ ఇందుకు వేదిక కానుంది. ‘3 ఆన్ 3’ ఫార్మాట్లో ఈ పోటీలు జరుగుతాయి. నగరానికి చెందిన మొత్తం 120 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. 16-18 ఏళ్లు, 19-23 ఏళ్ల మధ్య రెండు వయో విభాగాల్లో ఆటగాళ్లు పోటీ పడతారు. ఒక్కో మ్యాచ్‌లో కనీసం రెండు గేమ్‌లు జరుగుతాయి. ఆటతో పాటు వినోదాన్ని జోడించడం ఎన్బీఏ జామ్ ప్రత్యేకత. మూడు రోజుల పాటు మ్యాచ్‌లతో పాటు డీజీ మ్యూజిక్, డ్యాన్స్‌లతో వేదిక హోరెత్తనుంది. ఇందులో భాగంగా ఓపెన్ విభాగంలో త్రీ పాయింట్ రైఫిల్, వీడియో గేమ్స్ పోటీలను కూడా నిర్వహిస్తారు. ‘హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో కూడా ఈ పోటీలు జరుగుతాయి. ఆయా నగరాల విజేతలతో సెప్టెంబర్ 29న ముంబైలో ఫైనల్ నిర్వహిస్తాం. ఎన్బీఏ జామ్‌కు భారీ స్పందనను ఆశిస్తున్నాం. ఫైనల్‌కు దిగ్గజ ఎన్బీఏ ఆటగాళ్లు హొరాస్ గ్రాంట్, రాన్ హార్పర్, పెజా స్టొజకోవిక్ హాజరై ఇండియా విజేతలతో మ్యాచ్ కూడా ఆడతారు’ అని జైన్ చెప్పారు.