నేటి నుంచి నగరంలో ఎన్‌బీఏ షో
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోని ప్రతిష్టాత్మక బాస్కెట్ బాల్ లీగ్ ఎన్‌బీఏ (నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్) ఇప్పుడు భారత్‌లో కూడా తమ ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశంలోని నాలుగు నగరాల్లో కాలేజీ విద్యార్థుల కోసం ఎన్‌బీఏ జామ్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు ఈ ఈవెంట్ జరుగుతుంది.
సోనీ సిక్స్ చానల్ దీనికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఎన్‌బీఏ ఇండియా సీనియర్ డెరైక్టర్ ఆకాశ్ జైన్ ఈ వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీ ఇందుకు వేదిక కానుంది. ‘3 ఆన్ 3’ ఫార్మాట్‌లో ఈ పోటీలు జరుగుతాయి. నగరానికి చెందిన మొత్తం 120 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. 16-18 ఏళ్లు, 19-23 ఏళ్ల మధ్య రెండు వయో విభాగాల్లో ఆటగాళ్లు పోటీ పడతారు. ఒక్కో మ్యాచ్‌లో కనీసం రెండు గేమ్‌లు జరుగుతాయి.
ఆటతో పాటు వినోదాన్ని జోడించడం ఎన్‌బీఏ జామ్ ప్రత్యేకత. మూడు రోజుల పాటు మ్యాచ్‌లతో పాటు డీజీ మ్యూజిక్, డ్యాన్స్‌లతో వేదిక హోరెత్తనుంది. ఇందులో భాగంగా ఓపెన్ విభాగంలో త్రీ పాయింట్ రైఫిల్, వీడియో గేమ్స్ పోటీలను కూడా నిర్వహిస్తారు. ‘హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో కూడా ఈ పోటీలు జరుగుతాయి. ఆయా నగరాల విజేతలతో సెప్టెంబర్ 29న ముంబైలో ఫైనల్ నిర్వహిస్తాం. ఎన్‌బీఏ జామ్‌కు భారీ స్పందనను ఆశిస్తున్నాం. ఫైనల్‌కు దిగ్గజ ఎన్‌బీఏ ఆటగాళ్లు హొరాస్ గ్రాంట్, రాన్ హార్పర్, పెజా స్టొజకోవిక్ హాజరై ఇండియా విజేతలతో మ్యాచ్ కూడా ఆడతారు’ అని జైన్ చెప్పారు.