
హైదరాబాద్ స్కై పరాజయం
చెన్నై: యూబీఏ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్‌లో భాగంగా పుణే పేశ్వాస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ స్కై జట్టుకు ఓటమి ఎదురైంది. బుధవారం ఇక్కడి సత్యభామ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పుణే పేశ్వాస్ జట్టు 106– 102 తేడాతో హైదరాబాద్ జట్టుపై గెలుపొందింది. ఈ విజయంతో పుణే సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో గోవా జట్టుతో తలపడుతుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం చలాయించిన పుణే జట్టు ఆట అర్ధభాగం ముగిసేసరికి 51–46తో ముందంజలో ఉంది.
అయితే మూడో క్వార్టర్‌లో కెల్లీ చెలరేగడంతో అనూహ్యంగా హైదరాబాద్ 78–77తో ఆధిక్యాన్ని సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి క్వార్టర్‌లోనూ హైదరాబాద్ 94–86తో దూసుకెళ్లింది. కానీ చివరిక్షణాల్లో నరేందర్, న్యూటన్ అద్భుత ప్రదర్శనతో పుణే 106–102తో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున టెవిన్ కెల్లీ 45 పాయింట్లతో చెలరేగగా... మహిపాల్ సింగ్ (18), జోగిందర్ సింగ్ (15) రాణించారు. పుణే జట్టులో న్యూటన్ (41), నరేందర్ గ్రేవల్ (29) ఆకట్టుకున్నారు.