basket ball league
-
ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు
లెబ్రాన్ జేమ్స్(Lebron James).. బాస్కెట్ బాల్ గేమ్ ఫాలో అయ్యేవారికి పరిచయం అక్కర్లేని పేరు. నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్(NBA) గేమ్‌లో అతనికున్న క్రేజ్ వేరు. ముఖ్యంగా అమెరికాలో ఎన్బీఏ గేమ్ బాగా పాపులర్. తాజాగా లెబ్రాన్ జేమ్స్ ఎన్బీఏ ఆల్ టైమ్ పాయింట్స్ స్కోరింగ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. దీంతో లీగ్‌కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతని ఆట కోసం ఎంత డబ్బయినా ఖర్చు చేయడానికి అభిమానులు వెనుకాడడం లేదు. ఫిబ్రవరి 7న లాస్ ఏంజిల్స్ లేకర్స్, ఓక్లహామా సిటీ థండర్ మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్లు రికార్డు ధర పలికాయి. ఒక్కో టికెట్ 92 వేల డాలర్లు (సుమారు రూ.75 లక్షలు)కు అమ్ముడుపోతున్నట్లు బ్లీచర్ రిపోర్ట్ వెల్లడించింది. నిజానికి ఈ మ్యాచ్ లో లెబ్రాన్ జేమ్స్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు . లాస్ ఏంజిల్స్ లేకర్స్ అంతకుముందు ఫిబ్రవరి 4న న్యూ ఆర్లీన్స్ పెలికాన్స్ తో, ఫిబ్రవరి 9న మిల్వౌకీ బక్స్ తో, ఫిబ్రవరి 11న గోల్డెన్ స్టేట్ వారియర్స్ తో ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్ లలో ఏదో ఒకదాంట్లో జేమ్స్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సగటున లేకర్స్, థండర్ మ్యాచ్ టికెట్ ధర 1152 డాలర్లు (రూ.94 వేలు) గా ఉంది. ఇక లేకర్స్, బక్స్ మ్యాచ్ టికెట్ సగటు ధర 1302 డాలర్లు (రూ.లక్ష)గా ఉండటం విశేషం. ఎన్బీఏ (NBA)లో ఆల్ టైమ్ రికార్డు 38,387 పాయింట్లుగా ఉంది. ఈ రికార్డు కరీమ్ అబ్దుల్ జబ్బార్ పేరిట ఉంది. ఈ రికార్డు నాలుగు దశాబ్దాలుగా అలాగే ఉంది. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్ 38,325 పాయింట్లతో అతనికి చాలా దగ్గరగా ఉన్నాడు. 2003-04 సీజన్ లో అరంగేట్రం చేసిన లెబ్రాన్ జేమ్స్.. తొలి సీజన్ మినహా తర్వాత ప్రతి సీజన్ లోనూ ఒక్కో మ్యాచ్ కు సగటున 25 పాయింట్లు స్కోరు చేయడం గమనార్హం. ఈ మధ్యే ఇండియాన పేసర్స్ తోనూ అతడు 26 పాయింట్లు స్కోరు చేశాడు. -
హైదరాబాద్ స్కై పరాజయం
చెన్నై: యూబీఏ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్‌లో భాగంగా పుణే పేశ్వాస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ స్కై జట్టుకు ఓటమి ఎదురైంది. బుధవారం ఇక్కడి సత్యభామ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పుణే పేశ్వాస్ జట్టు 106– 102 తేడాతో హైదరాబాద్ జట్టుపై గెలుపొందింది. ఈ విజయంతో పుణే సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో గోవా జట్టుతో తలపడుతుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం చలాయించిన పుణే జట్టు ఆట అర్ధభాగం ముగిసేసరికి 51–46తో ముందంజలో ఉంది. అయితే మూడో క్వార్టర్లో కెల్లీ చెలరేగడంతో అనూహ్యంగా హైదరాబాద్ 78–77తో ఆధిక్యాన్ని సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి క్వార్టర్లోనూ హైదరాబాద్ 94–86తో దూసుకెళ్లింది. కానీ చివరిక్షణాల్లో నరేందర్, న్యూటన్ అద్భుత ప్రదర్శనతో పుణే 106–102తో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున టెవిన్ కెల్లీ 45 పాయింట్లతో చెలరేగగా... మహిపాల్ సింగ్ (18), జోగిందర్ సింగ్ (15) రాణించారు. పుణే జట్టులో న్యూటన్ (41), నరేందర్ గ్రేవల్ (29) ఆకట్టుకున్నారు. -
షార్ప్ షూటర్స్ గెలుపు
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో షార్ప్ షూటర్స్, సనత్‌నగర్ బాస్కెట్‌బాల్ క్లబ్ జట్లు గెలుపొందాయి. వైఎంసీఏ సికింద్రాబాద్ బాస్కెట్‌బాల్ క్లబ్లో గురువారం జరిగిన మ్యాచ్‌లో షార్ప్ షూటర్స్ 75-56తో రైజింగ్ స్టార్స్‌పై గెలిచింది. షూటర్స్ జట్టులో సంతోష్ 20, రోజ్ ఖాన్ 16 పాయింట్లు చేశారు. రైజింగ్ జట్టు తరఫున రాహుల్ (17), కిరణ్ రెడ్డి (14) రాణించారు. సనత్‌నగర్ జట్టు 68-63 స్కోరుతో నేషనల్ పోలీస్ అకాడమీ జట్టును ఓడించింది. సనత్‌నగర్ జట్టులో బసంత్ (21), పృథ్వి (16) ఆకట్టుకున్నారు. ఎన్పీఏ జట్టులో రవి 20, మనోజ్ 8 పాయింట్లు చేశారు. మిగతా మ్యాచ్‌ల్లో వైఎంసీఏ సికింద్రాబాద్ 62-28 స్కోరుతో వీజేఐటీపై, గెవిన్ బాస్కెట్‌బాల్ అకాడమీ 48-28తో బెల్లి బాయ్స్ జట్టుపై, యంగ్మెన్స్ గిల్డ్ 68-42తో ఫిబా క్లబ్‌పై గెలుపొందాయి. -
సెయింట్ మార్టిన్స్ గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్ఐ-ఐఎంజీ బాస్కెట్‌బాల్ లీగ్‌లో సెయింట్ మార్టిన్స్ కాలేజి 52-51తో సీవీఎస్ఆర్ కాలేజిపై విజయం సాధించింది. సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆట ప్రారంభం నుంచి సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు విశాల్ (20), సంతోష్ చక్కటి సమన్వయంతో ఆడటంతో ఒక సమయంలో 18-6తో జట్టు ముందంజలో ఉంది. అయితే వెంటనే తేరుకున్న సీవీఎస్ఆర్ ఆటగాళ్లు ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 26-20తో సెయింట్ మార్టిన్స్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. అనంతరం సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు చెలరేగడంతో జట్టు మళ్లీ 44-33తో ముందంజలో నిలిచింది. సీవీఎస్ఆర్ క్రీడాకారులు కృష్ణ (15), వివేక్ (13), మహేష్ (13) ప్రతిఘటించినప్పటికీ ఫలితం దక్కలేదు. సెయింట్ మార్టిన్స్ క్రీడాకారులు విశాల్‌తో పాటు జోన (12), సాయి (9) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మహిళల విభాగంలో సీవీఎస్ఆర్ కాలేజి 32-22తో సెయింట్ ఆన్స్ కాలేజిపై గెలిచింది. మ్యాచ్ ప్రథ మార్ధం ముగిసే సమయానికి 17-11తో సీవీఎస్ఆర్ ముందంజలో ఉంది. సీవీఎస్ఆర్ జట్టు క్రీడాకారిణులు ప్రత్యూష (15), స్పందన (9) చాకచ క్యంగా వ్యవహరించడంతో జట్టుకు విజయం చేకూరింది. సెయింట్ ఆన్స్ క్రీడాకారిణులు దివ్య (13), కీర్తి (9) రాణించారు. -
ఫైనల్స్‌లో గీతాంజలి స్కూల్
జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్ఐ ఐఎంజీ రిలయన్స్ స్కూల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో గీతాంజలి స్కూల్ జట్టు ఫైనల్‌కు చేరింది. వైఎంసీఏలో గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో గీతాంజలి 50-41తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 21-15తో గీతాంజలి జట్టు ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ప్రత్యర్థి నుంచి కొంత పోటీ ఎదురైనప్పటికీ భార్గవ్ (23), ఒమర్ (14), సహర్ష్ (9) చాకచక్యంగా వ్యవహరించడంతో జట్టుకు విజయం చేకూరింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టులో ప్రతీక్ (11), సుమిరన్ (10), అత్రేయ (8) రాణించారు. మరో మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ 52-38తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై గెలుపు దక్కించుకుంది. బాలికల విభాగం ఫలితాలు: చిరెక్ పబ్లిక్ స్కూల్: 52 (సన్హిత 16, నటాషా 14, సబ్రీన్ 10, దృష్టి 5); ఢిల్లీ పబ్లిక్ స్కూల్: 42 (శ్రీత 15, నేహ 11, యోగిత 11). సెయింట్ పాయిస్ హైస్కూల్: 33 (మౌనిక 12, పూజ నాయుడు 13, తేజస్విని 4); ఫ్యూచర్ కిడ్స్: 32 (మేఘన 12, హారిక 10, ప్రణవి 8). -
నేటి నుంచి నగరంలో ఎన్బీఏ షో
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోని ప్రతిష్టాత్మక బాస్కెట్ బాల్ లీగ్ ఎన్బీఏ (నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్) ఇప్పుడు భారత్‌లో కూడా తమ ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశంలోని నాలుగు నగరాల్లో కాలేజీ విద్యార్థుల కోసం ఎన్బీఏ జామ్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. సోనీ సిక్స్ చానల్ దీనికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఎన్బీఏ ఇండియా సీనియర్ డెరైక్టర్ ఆకాశ్ జైన్ ఈ వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీ ఇందుకు వేదిక కానుంది. ‘3 ఆన్ 3’ ఫార్మాట్లో ఈ పోటీలు జరుగుతాయి. నగరానికి చెందిన మొత్తం 120 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. 16-18 ఏళ్లు, 19-23 ఏళ్ల మధ్య రెండు వయో విభాగాల్లో ఆటగాళ్లు పోటీ పడతారు. ఒక్కో మ్యాచ్‌లో కనీసం రెండు గేమ్‌లు జరుగుతాయి. ఆటతో పాటు వినోదాన్ని జోడించడం ఎన్బీఏ జామ్ ప్రత్యేకత. మూడు రోజుల పాటు మ్యాచ్‌లతో పాటు డీజీ మ్యూజిక్, డ్యాన్స్‌లతో వేదిక హోరెత్తనుంది. ఇందులో భాగంగా ఓపెన్ విభాగంలో త్రీ పాయింట్ రైఫిల్, వీడియో గేమ్స్ పోటీలను కూడా నిర్వహిస్తారు. ‘హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో కూడా ఈ పోటీలు జరుగుతాయి. ఆయా నగరాల విజేతలతో సెప్టెంబర్ 29న ముంబైలో ఫైనల్ నిర్వహిస్తాం. ఎన్బీఏ జామ్‌కు భారీ స్పందనను ఆశిస్తున్నాం. ఫైనల్‌కు దిగ్గజ ఎన్బీఏ ఆటగాళ్లు హొరాస్ గ్రాంట్, రాన్ హార్పర్, పెజా స్టొజకోవిక్ హాజరై ఇండియా విజేతలతో మ్యాచ్ కూడా ఆడతారు’ అని జైన్ చెప్పారు.