South Africa-India Test Match
-
సఫారీల చేతిలో ధోని సేన చిత్తు
-
సఫారీల చేతిలో ధోని సేన చిత్తు
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలయింది. ఆతిథ్య జట్టు చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. టీమిండియా నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా వికెట్లేమి నష్టపోకుండా ఛేదించింది. 11.4 ఓవర్లలో 59 పరుగులు చేసింది. స్మిత్ 27, పీటర్సన్ 31 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ధోని సేన 223 పరుగులకు ఆలౌటయింది. అజింక్య రహానే ఒక్కడే రాణించి 96 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. స్టెయిన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', డీవిలియర్స్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్నారు. జోహెన్నెస్ బర్గ్‌లో జరిగిన తొలి టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే. -
రహానే తొలి టెస్టు సెంచరీ మిస్
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాడు అజింక్య రహానే కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. నాలుగు పరుగుల తేడాతో తొలి టెస్టు శతకం చేజార్చుకున్నాడు. 96 పరుగులు చేసి ఫిలాండర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటయింది. రహానే ఒక్కడే రాణించాడు. ఒక్కపక్క వికెట్లు పడుతున్నా తాను మాత్రం సంయమనం కోల్పోకుండా ఆడాడు. 96 పరుగుల వద్ద చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి భారత్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. ఇలా వచ్చి అలా వెళ్లారు. ధావన్ 19, విజయ్ 6, పూజారా 32, కోహ్లి 11, రోహిత్ శర్మ 25, ధోని 15, జడేజా 8, జహీర్ ఖాన్ 3 పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లోనూ రహానే రాణించాడు. 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. -
సెంచరీకి చేరువలో విజయ్
డర్బన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య గురువారమిక్కడ ప్రారంభమైన రెండో టెస్టుకు అంతరాయం కలిగింది. వెలుతురు సరిగా లేకపోవడంతో ఆట నిలిచిపోయింది. లైట్లను సరి చేసేందుకు మైదాన సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆట ఆగిపోయే సమయానికి భారత్ 181/1 స్కోరుతో బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమింయా 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్(29) మరోసారి విఫలమయ్యాడు. మురళీ విజయ్, పూజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అర్థ సెంచరీలతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. విజయ్ 91, పూజారా 58 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. విజయ్ సెంచరీకి 9 పరుగుల దూరంలో ఉన్నాడు. సెంచరీ పూర్తి చేస్తే టెస్టుల్లో అతడికిది నాలుగోది అవుతుంది.