South Indian Film Artistes Association
-
దక్షిణ భారత నటీనటుల సంఘం దీపావళి కానుక
చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గం సంఘం సభ్యులకు దీపావళి పండగ సందర్భంగా కానుక అందించాలని నిర్ణయించింది. కమలహాసన్, రజనీకాంత్ సహా 3500 మంది సభ్యులకు దీపావళి కానుకగా మగ వారికి పంచెలు, మహిళలకు చీరెలతో పాటు స్వీట్లు అందించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో సంఘం కార్యవర్గం పేర్కొంది. సంఘంలోని కార్యనిర్వాహక వర్గ సభ్యులను కొన్ని బృందాలుగా విభజించి తమిళనాడులోని అన్ని గ్రామాల్లోని నాటక కళాకారులను కలిసి వారి జీవన విధానాన్ని, ఆదాయ అంశాలను, ప్రస్తుత స్థితిగతులను తెలుసుకుని సంఘానికి నివేదించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దీపావళి పండగ తర్వాత ఆ కార్యక్రమం మొదలవుతుందని వెల్లడించారు. -
నా మద్దతు నాన్నకే
చెన్నై : ప్రస్తుతం కోలీవుడ్‌లో ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.కారణం అందరికీ తెలిసిందే. త్వరలో జరగనున్న దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలకు ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.అందులో ప్రస్తుత సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఒక వర్గంగానూ నటుడు విశాల్ బృందం వర్గంగానూ పోటీకి సిద్ధం అవుతున్నాయి. శరత్‌కమార్ వర్గం విజయం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తుంటే, ఓడిపోయినా పర్వాలేదు పోటీ చేసే తీరుతాం అంటున్నారు విశాల్ వర్గం.అంతేకాదు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.అదే సమయంలో ఊరూరా తిరిగి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే శరత్‌కుమార్‌కు విశాల్‌కు మధ్య వైరానికి కారణం నటి వరలక్ష్మినేనని,ఆమే శరత్‌కుమార్ పైకి విశాల్‌ను ఉసిగొల్పుతున్నారని సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రచారం హల్చల్ చేస్తోంది. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కూతురన్న విషయం గమనార్హం. అలాగే విశాల్‌కు వరలక్ష్మి శరత్‌కుమార్ కి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనే వదంతులు చాలా కాలంగా హోరెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నడిగర్ సంఘం ఎన్నికల్లో నటి వరలక్ష్మి మద్దతు విశాల్‌కే ఉంటుందనే ఊహాగానాలు ఇంటర్నెట్లలో దుమారం రేపుతున్నాయి. ఇలాంటి ప్రచారంపై ఇప్పటివరకు పట్టించుకోని నటి వరలక్ష్మి తాజాగా ఘాటుగా స్పందించారు.సోషల్నెట్వర్క్స్లో అసత్యాల్ని ప్రచారం చేసేవారంతా కళ్లులేని కబోదులని తన ట్విట్టర్లో విమర్శించారు. తన మద్దతు ఎప్పుడూ తన తండ్రికే ఉంటుందని వరలక్ష్మి కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించారు. -
కోర్టుకెక్కిన హీరో విశాల్
చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) ఎన్నికలపై హీరో విశాల్ కోర్టుకెక్కారు. ఎన్నికల తేదీని మార్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ తో తాడోపేడో తేల్చుకునేందుకు అతడు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. శరత్ కుమార్, విశాల్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. శరత్ కుమార్ చర్యలను విశాల్ తరచుగా ప్రశ్నిస్తున్నారు. సంఘంపై తరచూ విమర్శలు చేస్తే విశాల్‌పై వేటు వేస్తామని శరత్‌కుమార్ హెచ్చరించారు. అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నిస్తే తప్పా? సంఘం నుంచి బహిష్కరించినా భయపడను అంటున్నారు నటుడు విశాల్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం ఎన్నికల తేదీపై విశాల్ కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.