బలపడిన అల్పపీడనం.. నేడు వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. బుధవారానికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్ నుంచి ఉత్తరాంధ్ర మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం మధ్యలో పయనిస్తోంది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమలపై నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో మూడురోజులు కొనసాగుతాయని ఐఎండీ మంగళవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు, పశి్చమ గోదావరి, ఎనీ్టఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, ఎస్పీఎస్సార్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు, తీరం వెంబడి 45 నుంచి 55.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. మూడురోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. మంగళవారం భారీవర్షాలు కురిశాయి. ఎనీ్టఆర్, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండలో అత్యధికంగా 10.2, విశాఖ రూరల్‌లో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.