ఏటీఎంల కోసం ఒడిశా వాసులు.. ఛలో ఆంధ్ర
ఫై-లీన్ తుపాన్ ప్రభావం నుంచి ఒడిశా ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. భారీ వర్షాలు, వరదల ధాటికి అపార ఆస్థి నష్టం జరగగా, పునరుద్ధరణ కార్యక్రమాలు ఇంకా పూర్తి స్తాయిలో చేపట్టలేదు. బరంపురం, తదితర పట్టణాల్లో ఏటీఎంలు, బ్యాంక్ కార్యకలాపాలు స్తంభించిపోవడంతో అక్కడి ప్రజలు డబ్బుల కోసం ఆంధ్రప్రదేశ్కు తరలివస్తున్నారు.
పట్టు పరిశ్రమకు ప్రఖ్యాతిగాంచిన బరంపురంలో తుపాన్ ప్రభావానికి చాలా ఏటీఎంలు ధ్వంసం కాగా, మిగిలినవి విద్యుత్ అంతరాయం వల్ల పనిచేయడం లేదు. పట్టణంలో ఒకే ఒక ఎస్బీఐ ఏటీఎం పనిచేస్తోంది. ఇక్కడ డబ్బులు తీసుకువాలంటే గంటల కొద్దీ క్యూలో ఎదురు చూడాల్సిన పరిస్థితి. దీంతో ఇచ్చాపురం తదితర ఆంధ్రప్రదేశ్ పట్టణాలకు వస్తున్నారు. వీరిలో సరిహద్దు ఒడిశా పట్టణాల ప్రజలు, అందులోనూ తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. ఏటీఎంల కోసమే గాక మొబైల్ ఫోన్లకు రీచార్జ్ చేయించాలన్నా రాక తప్పదని ఓ బరంపురం వాసి చెప్పాడు.