south-west monsoon
-
విస్తరించిన నైరుతి.. 24 గంటల్లో వెదర్ ఇలా!
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్‌లోని పెని వద్ద తీరాన్ని దాటి బలహీనపడింది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరం వద్ద తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతం అయింది. జార్ఖండ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దీంతో రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురవవచ్చునని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పూర్తిగా.. ఒడిశాలో కొంతభాగం వరకు రుతుపవనాలు విస్తరించాయి. మహారాష్ట్రలో కొంతభాగం వరకు రుతుపవనాలు వ్యాపించాయి. -
తెలుగు రాష్ట్రాలకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు చల్లని కబురందించాయి. శుక్రవారం ఇవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. మరో 24 గంటల్లో ఇవి మరింత బలపడి దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్, మాల్దీవుల్లోకి విస్తరించనున్నాయి. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ప్రస్తుతం అండమాన్ పరిసరాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం, నైరుతి బంగాళాఖాతంలో మరొకటి, బిహార్ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో ఈ నెల 28 నాటికల్లా తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. ఇది బలపడుతుందా? లేదా? ఎటు వైపు పయనిస్తుందన్న దానిపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రోహిణి కార్తె ప్రారంభం నేపథ్యంలో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మళ్లీ విజృంభించనున్నాయి. 28న ఏర్పడే అల్పపీడనం ప్రభావం వల్ల దక్షిణ గాలులు తగ్గి ఉష్ణ తీవ్రత పెరగనుందని, అదే సమయంలో ఉక్కపోత కూడా అధికమవుతుందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. కాగా శనివారం రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ఆస్కారముందని ఐఎండీ వెల్లడించింది. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెంటచింతలలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. -
‘నైరుతి’ ఆలస్యం..!
భూమధ్య రేఖ దాటాక బలహీనపడ్డ రుతుపవనాలు జూన్ 1కి కేరళకు.. విస్తరణలోనూ జాప్యం సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. ఈసారి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే అండమాన్‌లో ప్రవేశించడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 30 నాటికల్లా కేరళను తాకవచ్చని వాతావరణ విభాగం తొలుత అంచనా వేసింది. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. భూమధ్య రేఖను దాటాక రుతుపవనాలు బలహీనపడటంతో ప్రస్తుతం నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్నాయి. ఇవి కేరళలో ప్రవేశించడానికి మూడు రోజులైనా పట్టవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటో తేదీకల్లా తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. వడదెబ్బతో రాష్ట్రంలో 90 మంది మృతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. రామగుండంలో శుక్రవారం 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత న మోదైంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 45, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలలో 44, మహబూబ్‌నగర్‌లో 43.6, రంగారెడ్డిలో 43.1, హైదరాబాద్‌లో 43, మెదక్‌లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, గత 24 గంటల్లో నాగర్‌కర్నూల్‌లో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కాగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 90 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో 166 మంది.. ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ వడగాడ్పుల జోరు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బతో 166 మంది మృత్యువాత పడ్డారు. -
సకాలంలోనే తొలకరి
నైరుతి రుతుపవనాలు సానుకూలం సాక్షి, హైదరాబాద్: రైతులు ఆశగా ఎదురుచూస్తున్న తొలకరి ఈసారి సకాలంలోనే పలకరిస్తుందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చే నెల 8 నుంచి 12 తేదీల మధ్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించవవచ్చని వారు ఓ అంచనాకొచ్చారు. దక్షిణార్ధ గోళం నుంచి మొదలై రుతుపవన గాలులు శ్రీలంక మీదుగా కేరళలోకి ఈ నెల 18న ప్రవేశించాయనీ, ఇవి జూన్ రెండో వారంలో కోస్తా జిల్లాలను తాకవచ్చని వారు తెలిపారు. ఈ సీజన్లో సాధారణంకంటే కాస్త ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని, దాదాపు 95 శాతం వర్షపాతం ఉండవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కూడా చెబుతోంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. ఒక రుతుపవనాల సీజన్ అంత బాగోకపోతే ఆ తర్వాతి సీజన్లో మంచి వర్షాలు కురుస్తుంటాయి. కిందటి నవంబరులో కోస్తాంధ్ర జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాలు పెద్దగా ప్రభావాన్ని చూపకపోవడంతో ఈసారి నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉండొచ్చని ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఓఎస్ఆర్యూ భానుకుమార్ అభిప్రాయపడ్డారు. యురేషియాపై (ఐరోపా, ఆసియా) హిమపాతం (స్నో కవర్) తక్కువగా ఉండటంతో పాటు ఉత్తర హిందూ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం రుతుపవనాలకు సానుకూలమని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలకు ముందు వచ్చే ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వానలు (ప్రి మాన్సూన్స్ థండర్ షవర్స్) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. దీనికితోడు మే నెలాఖరులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి రుతుపవనాల రాకను తెలియజేస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఖరీఫ్ సమీపించడంతో రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్ అంతటా సుమారు 46.66 లక్షల హెక్టార్లలో పంటల సాగుకి అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనాకొచ్చింది. అలాగే ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో 1.27 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండుతాయనే అంచనాతో వ్యవసాయశాఖ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. దీంతోపాటు.. వాతావరణం ఆశాజనకంగా ఉంటుందని నిపుణులు చెబుతుండటంతో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవలసి ఉంది. రుణాల విషయంలోనూ రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.