సకాలంలోనే తొలకరి
నైరుతి రుతుపవనాలు సానుకూలం
సాక్షి, హైదరాబాద్: రైతులు ఆశగా ఎదురుచూస్తున్న తొలకరి ఈసారి సకాలంలోనే పలకరిస్తుందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చే నెల 8 నుంచి 12 తేదీల మధ్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించవవచ్చని వారు ఓ అంచనాకొచ్చారు. దక్షిణార్ధ గోళం నుంచి మొదలై రుతుపవన గాలులు శ్రీలంక మీదుగా కేరళలోకి ఈ నెల 18న ప్రవేశించాయనీ, ఇవి జూన్ రెండో వారంలో కోస్తా జిల్లాలను తాకవచ్చని వారు తెలిపారు. ఈ సీజన్‌లో సాధారణంకంటే కాస్త ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని, దాదాపు 95 శాతం వర్షపాతం ఉండవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కూడా చెబుతోంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. ఒక రుతుపవనాల సీజన్ అంత బాగోకపోతే ఆ తర్వాతి సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తుంటాయి.
కిందటి నవంబరులో కోస్తాంధ్ర జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాలు పెద్దగా ప్రభావాన్ని చూపకపోవడంతో ఈసారి నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉండొచ్చని ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్ అభిప్రాయపడ్డారు. యురేషియాపై (ఐరోపా, ఆసియా) హిమపాతం (స్నో కవర్) తక్కువగా ఉండటంతో పాటు ఉత్తర హిందూ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం రుతుపవనాలకు సానుకూలమని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలకు ముందు వచ్చే ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వానలు (ప్రి మాన్సూన్స్ థండర్ షవర్స్) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. దీనికితోడు మే నెలాఖరులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి రుతుపవనాల రాకను తెలియజేస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఖరీఫ్ సమీపించడంతో రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్ అంతటా సుమారు 46.66 లక్షల హెక్టార్లలో పంటల సాగుకి అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనాకొచ్చింది. అలాగే ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో 1.27 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండుతాయనే అంచనాతో వ్యవసాయశాఖ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. దీంతోపాటు.. వాతావరణం ఆశాజనకంగా ఉంటుందని నిపుణులు చెబుతుండటంతో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవలసి ఉంది. రుణాల విషయంలోనూ రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.