southkorea
-
దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ
సియోల్: దక్షిణ కొరియా దేశాధ్యక్ష ఎన్నికలు బుధవారం జరిగాయి. ఈ దఫా ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రీ ఎలక్షన్ సర్వేలో అధికార డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి లీ జే మైంగ్,ప్రతిపక్ష పీపుల్స్ పవర్ పార్టీ అభ్యర్థి జనరల్ యూన్ సుక్ యేల్లు ఇతర అభ్యర్థుల కన్నా ముందంజలో ఉన్నారని తేలింది. ఎన్నికల అనతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో జనరల్ యూన్‌కు 48.4 శాతం, లీ కి 47.8 శాతం ఓట్లు వచ్చాయి. బుధవారం ఎన్నికలో సుమారు 77 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో గెలుపొందినవారు మేలో అధ్యక్ష పదవి చేపడతారు. -
అమెరికాకు దక్షిణకొరియా షాక్!
సియోల్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దూకుడుతో ప్రపంచానికి షాక్ ఇస్తుంటే.. కొరియా దేశాలు మాత్రం అమెరికాకు షాక్ ఇస్తున్నాయి. ఓ వైపు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికాపై అణుదాడి చేస్తానని వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ అమెరికాకు షాక్ ఇచ్చాడు. ఉత్తరకొరియా సరిహద్దులో ఏర్పాటు చేసిన క్షిపణి దాడిని తిప్పికొట్టగల టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్) వ్యవస్ధను అమెరికా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, అవసరమైన వాటి కన్నా ఎక్కువ సంఖ్యలో వీటిని ఏర్పాటు చేయడంపై విచారణకు ఆదేశించారు మూన్. ఉదారవాదిగా పేరున్న మూన్ తొలుత నుంచి ఉత్తరకొరియాతో చర్చలకు సుముఖంగా ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల నాటి ఆయన మద్దతు దారులు థాడ్ వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఆయన సలహాదారు యోన్ యంగ్ చాన్ ఓ టీవీ కార్యాక్రమంలో మాట్లాడుతూ నాలుగు అదనపు థాడ్ లాంచర్ల ఏర్పాటును అధ్యక్షుడు గుర్తించారని చెప్పారు. అలా ఎందుకు చేయాల్సివచ్చిందో తెలుసుకోవాలని దర్యాప్తుకు ఆదేశించారని తెలిపారు. వీటిని ఎందుకు తెప్పించారన్న దానిపై రక్షణ శాఖ సీనియర్ అధికారులు తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆయన అన్నారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ థాడ్ వ్యవస్థల ఏర్పాటుకు దక్షిణ కొరియా సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో మూన్ నిర్ణయం వెలువడటం గమనార్హం. -
శాంసంగ్‌తో అవినీతి.. దేశాధ్యక్ష పదవి ఊడింది
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హే(65)పై పార్లమెంటు ఆమోదించిన అభిశంసన తీర్మానాన్ని ఆ దేశ సుప్రీం కోర్టు సమర్ధించింది. దీంతో పార్క్ పదవి నుంచి తప్పుకోనున్నారు. అభిశంసనతో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకున్న ఒక దేశ అధ్యక్షురాలిని తొలగించడం దక్షిణ కొరియాలో ఇదే తొలిసారి. పార్క్ కొందరు వ్యాపారవేత్తలతో చేతులు కలిపి అవినీతికి పాల్పడటం వల్ల దక్షిణ కొరియాలో కొద్ది నెలలుగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. తన స్నేహితురాలైన చోయ్ సూన్ సిల్‌తో కుమ్మక్కై పార్క్ శాంసంగ్ గ్రూప్ హెడ్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. 2015లో దేశంలో రెండు చోట్ల ఉన్న శాంసంగ్ కార్యాలయాలను ఒకే చోటుకు మార్చడం వెనుక కూడా పార్క్ హస్తం ఉంది. గతేడాది డిసెంబర్ 9న పార్క్‌పై ఉన్న ఆరోపణల కారణంగా ఆమె పదవిలో కొనసాగడానికి అనర్హురాలని దక్షిణ కొరియా పార్లమెంటు పేర్కొంది. అయినా వెనక్కు తగ్గని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన ఎనిమిది మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం పార్క్ అవినీతి పాల్పడ్డారని.. అధ్యక్ష పదవిలో కొనసాగడానికి ఆమె అనర్హురాలని తేల్చి చెప్పింది. దక్షిణ కొరియా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ అయితే 60 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని/అధ్యక్షురాలిని ఎన్నుకోవాల్సివుంటుంది.