అమెరికాకు దక్షిణకొరియా షాక్!
సియోల్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దూకుడుతో ప్రపంచానికి షాక్ ఇస్తుంటే.. కొరియా దేశాలు మాత్రం అమెరికాకు షాక్ ఇస్తున్నాయి. ఓ వైపు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికాపై అణుదాడి చేస్తానని వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ అమెరికాకు షాక్ ఇచ్చాడు. ఉత్తరకొరియా సరిహద్దులో ఏర్పాటు చేసిన క్షిపణి దాడిని తిప్పికొట్టగల టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్) వ్యవస్ధను అమెరికా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే, అవసరమైన వాటి కన్నా ఎక్కువ సంఖ్యలో వీటిని ఏర్పాటు చేయడంపై విచారణకు ఆదేశించారు మూన్. ఉదారవాదిగా పేరున్న మూన్ తొలుత నుంచి ఉత్తరకొరియాతో చర్చలకు సుముఖంగా ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల నాటి ఆయన మద్దతు దారులు థాడ్ వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.
ఆయన సలహాదారు యోన్ యంగ్ చాన్ ఓ టీవీ కార్యాక్రమంలో మాట్లాడుతూ నాలుగు అదనపు థాడ్ లాంచర్ల ఏర్పాటును అధ్యక్షుడు గుర్తించారని చెప్పారు. అలా ఎందుకు చేయాల్సివచ్చిందో తెలుసుకోవాలని దర్యాప్తుకు ఆదేశించారని తెలిపారు. వీటిని ఎందుకు తెప్పించారన్న దానిపై రక్షణ శాఖ సీనియర్ అధికారులు తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆయన అన్నారు.
ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ థాడ్ వ్యవస్థల ఏర్పాటుకు దక్షిణ కొరియా సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో మూన్ నిర్ణయం వెలువడటం గమనార్హం.