northkorea
-
పరిధిలోకి అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా
సియోల్/వాషింగ్టన్ : ఉత్తరకొరియా బుధవారం మరోసారి ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ని పరీక్షించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా గుర్తించినందుకే ఈ క్షిపణిని పరీక్షించినట్లు కిమ్ దేశం ప్రకటించింది. దాదాపు 1000 కిలోమీటర్ల పాటు ప్రయాణించిన క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో పడినట్లు పెంటగాన్ పేర్కొంది. ఈ పరీక్షతో ఉత్తరకొరియా అమెరికాలోని ఏ భూభాగాన్నైనా ఢీ కొట్టగల సామర్ధ్యాన్ని సాధించినట్లు రక్షణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. అమెరికాతో పాటు, యూరప్, ఆస్ట్రేలియాల్లోని ఏ ప్రాంతాన్నైనా చేరుకోగల సామర్ధ్యం ఉత్తరకొరియా సాధించింది. కాగా, ఉత్తరకొరియా తాజా పరీక్షపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ రక్షణను తాము చూసుకుంటామని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ ఉత్తరకొరియా క్షిపణిపరీక్షపై అత్యవసరంగా భేటీ కానుంది. ఉత్తరకొరియా పరీక్షను జపాన్, దక్షిణ కొరియాల అధ్యక్షులు ఖండించారు. -
'మీ కిమ్ మాట వినడా.. మా దేశం వదిలి వెళ్లు'
రోమ్ : ఉత్తర కొరియాను ఒంటరి చేసే పనులు వేగవంతం అవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌తోపాటు దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాలు ఆ దేశం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఆ వరుసలతో తాజాగా ఇటలీ చేరింది. తమ దేశానికి కొత్తగా వస్తున్న ఉత్తర కొరియా రాయబారి వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. తాము చెబుతున్న వినకుండా అణుపరీక్షలు నిర్వహిస్తున్న కిమ్ జాంగ్ ఉన్ తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఏంజెలినో అల్ఫానో ఇటలీ డెయిలీ లా రిపబ్లికాకు తెలియజేశారు. ఉత్తర కొరియా రాయబారిని వెనక్కి పంపించడాన్ని ఆ దేశం అర్థం చేసుకుంటుందని తాము భావిస్తున్నామన్నారు. ఒక వేళ ఉత్తర కొరియా తన వైఖరిని మార్చుకోకుంటే తమ నిర్ణయం సరైనదే అని ఆ దేశానికి అనిపించేలా చేయడమే తమ ఉద్దేశం అన్నారు. ఇక ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. దాదాపు ఏడాదిపాటు ఖాళీగా ఉన్న రాయబారి పదవిని ఈ ఏడాది జూలైలోనే కిమ్ నింపాడు. రోమ్కు తమ దేశ ప్రతినిధిగా మున్ జాంగ్ నామ్ అనే వ్యక్తిని నియమించారు. ప్రస్తుతం ఆయననే వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఇటలీ ప్రభుత్వం ఆదేశించింది. -
అమెరికా ముందు ఆరు మార్గాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మాటలు తూటాలై పేలుతుండటంతో ప్రపంచమంతటా యుద్ధమేఘాల భయం అలముకుంది. పలుమార్లు అమెరికాపై అణుదాడి చేస్తామని హెచ్చరించిన ఉత్తరకొరియా నియంత కిమ్ రక్తం ఎప్పుడూ మరుగుతూనే ఉంటుందేమో. అందుకు ప్రతిగా వయసులో పెద్దవాడైన ట్రంప్ కూడా సంయమనం పాటించకుండా కామెంట్లు చేస్తున్నారు. గత యుద్ధాల నుంచి పాశ్చాత్య దేశాలు నేర్వాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. ఆపదల సమయంలో సంయమనం పాటించి వ్యూహం రచించక నష్టపోయిన దాఖలాలు కోకొల్లలు. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఉత్తరకొరియాను అదుపు చేయడానికి అమెరికా ముందు ఆరు మార్గాలు ఉన్నాయని ఆక్సఫర్డ్‌కు చెందిన క్రైసిస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మార్క్ ఆల్మండ్ చెప్పారు. వాటిని ఓ సారి చూద్దాం. భారీ దాడికి పోవద్దు అణు ఆయుధాలను తయారు చేస్తున్న ఉత్తరకొరియాపై 1994లో అమెరికా అధ్యక్షుడు క్లింటన్ బాంబర్స్‌తో దాడి చేయించారు. అయితే, అప్పుడు ఉత్తరకొరియా పరిస్ధితి వేరు. ఆ దాడిలో తమ స్ధావరాలను కాపాడుకోలేక ఆ దేశం చతికిలపడింది. కానీ నేటి ఉత్తరకొరియా ఆయుధసంపత్తిలో ఆరి తేరింది. జపాన్, దక్షిణకొరియా, గ్వామ్లలో ఉన్న వాయుదళంతో అమెరికా ఉత్తరకొరియా అణుస్ధావరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే క్షిపణులను అప్పటికప్పుడు తరలించగల శక్తిని జోంగ్ దేశం సాధించింది. అంతేకాదు ఉత్తరకొరియా తాజాగా తయారుచేసుకున్న క్షిపణులను కొద్ది సమయంలోనే సిద్ధం చేసి ప్రయోగించొచ్చు. కాబట్టి, భారీ ఎయిర్స్ట్రైక్తో ఉత్తరకొరియాను అడ్డుకుందామని అనుకుంటే అమెరికా బొక్కబొర్లా పడటం ఖాయం. పూర్తి సైన్యంతో దిగాల్సిందే.. తొలి ఉత్తరకొరియా యుద్ధంలో ఆ దేశానికి నేవీ లేదు. కాబట్టి అమెరికా బలగాలు సముద్రతీరం నుంచి ప్యాంగ్యాంగ్కు వెళ్లడానికి పెద్దగా కష్టపడాల్సిరాలేదు. కానీ, ప్రస్తుత పరిస్ధితి మారిపోయింది. ఉత్తరకొరియా పూర్తిస్ధాయిలో సైన్యాన్ని నిర్మించుకుంది. ఇలాంటి దశలో అమెరికా కేవలం దక్షిణకొరియాలో ఉన్న తన సైన్యాన్ని వినియోగించి యుద్ధరంగంలోకి దిగితే ఓటమి చవిచూడక తప్పదు. ఇలాంటి స్ధితిలో అమెరికా ఆప్ఘనిస్తాన్, ఇరాన్లలో మొహరించిన తన సైన్యాన్నంతటినీ ఉత్తరకొరియాకు తరలించాలి. ఇలా చేయడం అసాధ్యం. కాబట్టి అమెరికా దక్షిణకొరియాకు ఉన్న ఆరు లక్షల యాభై వేల మంది సైన్యాన్ని యుద్ధానికి పంపాలని కోరే అవకాశం ఉంది. కానీ దక్షిణకొరియా అమెరికా అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే.. అమెరికాకు సైన్యాన్ని ఇవ్వడం వల్ల ఉత్తరకొరియా దక్షిణకొరియాపై అణుదాడి చేయడం ఖాయం. ఇకపోతే చైనా. అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించాలని చూస్తున్న ఆ దేశానికి.. తమ ప్రాంతంలోని ఓ దేశంపై అమెరికా దండెత్తడం రుచించకపోవచ్చు. కాబట్టి ఉత్తరకొరియాపై యుద్ధాని కంటే ముందు అమెరికా.. చైనాతో చర్చించాల్సివుంటుంది. లేకుంటే ఉత్తరకొరియా-అమెరికాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు. వీటన్నింటిని దాటి అమెరికా భారీ సైనిక దళంతో ఉత్తరకొరియాలో ప్రవేశించాలని చూసినా.. జరిగే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కిమ్ వద్ద దాదాపు 60కు పైగా అణు ఆయుధాలు, లెక్కకు మించిన రసాయన, జీవ ఆయుధాలు ఉన్నాయి. సైన్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి ఉత్తరకొరియా అణు ఆయుధ స్ధావరాలను నాశనం చేయడం ఒక్కటే అమెరికాను విజయతీరాలకు చేర్చదు. రక్త దాహానికి అలవాటు పడ్డ కిమ్ లాంటి నియంతను నామరూపాల్లేకుండా చేయాలంటే ఆ దేశ సైన్యాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించగలగాలి. కనిపించిన సైనికుడిని నరికిపారేసి మారణహోమం సృష్టించాలి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, అతని కీలక కమాండర్లు కౌంటర్ అటాక్‌కు ప్లాన్ చేసే లోపే స్మార్ట్ బాంబు సాయంతో వారిని మట్టుబెట్టగలగాలి. ఒకవేళ కిమ్‌ను అంతం చేయడం మిస్ అయితే, పొరుగుదేశాలైన జపాన్, దక్షిణకొరియా, ఉత్తరకొరియా రేంజ్‌కు అందుబాటులో ఉన్న ప్రతి బేస్ సర్వనాశనం అవుతుంది. ఒకవేళ అమెరికా-దక్షిణకొరియా బలగాలు ఉత్తరకొరియాను తమ అదుపులోకి తీసుకున్నా.. గెరిల్లా యుద్ధాలు మాత్రం ఆగవు. పెద్ద సంఖ్యలో ఉత్తరకొరియన్లు చైనాకు శరణార్థులుగా వెళ్లే అవకాశం ఉంటుంది. అమెరికా అణు దాడి అగ్రరాజ్యం అణు దాడే శరణ్యంగా భావించే ఉత్తరకొరియా ప్రపంచపటం మీద లేకుండా చేస్తే మిగిలిన ప్రపంచదేశాలు ఆత్మరక్షణలో పడతాయి. అంతేకాదు అమెరికాతో ఏర్పడిన సైనిక కూటములుగా ఏర్పడిన దేశాలు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాయి. చైనా, రష్యాలాంటి దేశాలు భారీ స్ధాయిలో రక్షణ బడ్జెట్‌ను పెంచి ఆయుధసంపత్తిని పెంచుకుంటాయి. చైనాపై ఒత్తిడి చైనాను బతిమాలో బామాలో ఉత్తరకొరియాపై ఒత్తిడి తీసుకొద్దామని ట్రంప్ గతంలో ప్రయత్నించారు. కానీ అవి సఫలం కాలేదు. మరికొంత ఒత్తిడి తెచ్చేందుకు చైనాను హెచ్చరించారు కూడా. అయినా ప్రయోజనం లేదు. కారణం ఉత్తరకొరియాతో చైనాకు ఉన్న సత్సంబంధాలు కూడా అంతంతమాత్రమే. చైనాతో అంటి ముట్టనట్లు ఉంటున్న ఉత్తరకొరియా.. తామరకుపై నీటి బిందువు వలే ఎప్పుడైనా జారిపోయేందుకు సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ చర్య ప్యాంగ్యాంగ్ పదేళ్ల క్రితం అణు పరీక్షలు చేయడం ప్రారంభించిన నాటి నుంచే యూఎన్ భద్రతామండలి ఆ దేశానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూనే ఉంది. ఈ విధంగా చూస్తే అమెరికాకు, రష్యా, చైనాల మద్దతు కూడా బలంగా ఉంది. ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించేందుకు ఆ దేశాలు వెనుకాడటం లేదు. బాహ్య ప్రపంచం నుంచి ఉత్తరకొరియాకు వాణిజ్యపరంగా సహాకారం అందిస్తుంది కూడా ఈ రెండు దేశాలు కావడం గమనార్హం. వాణిజ్యాన్ని నిలిపివేయాలనే తీర్మానం చేయడం వల్ల ఉత్తరకొరియా అతలాకుతలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలా చేస్తే రష్యా, చైనాల మీద కిమ్ అణుదాడికి వెనుకాడకపోవచ్చు. -
అణు దాడి చేయనున్న ఉత్తరకొరియా!
సియోల్/న్యూజెర్సీ: పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధీనంలో ఉన్న ఓ ద్వీపంపై అణుదాడి చేయడానికి ఉత్తరకొరియా పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా పేర్కొంది. ఉత్తరకొరియాకు 2,128 మైళ్ల దూరంలో ఉన్న గువాం ద్వీపంపై దాడి చేయన్నట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉత్తరకొరియాపై చేసిన వ్యాఖ్యలే దాడి నిర్ణయానికి కారణమని వెల్లడించింది. గువాం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపం. ఈ ద్వీప జనాభా కేవలం ఒక లక్షా అరవై వేలు. దీని తీరంలో అమెరికాకు చెందిన సబ్ మెరైన్ల స్క్వాడ్రన్, ఒక ఎయిర్‌బేస్, కోస్ట్ గార్డు గ్రూప్‌లు ఉన్నాయి. వాటన్నింటిని నాశనం చేసేందుకు పక్కావ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఉత్తరకొరియా చెప్పింది. తమ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ ఆమోదించిన మరుక్షణమే.. గువాంను ప్రపంచపటంలో లేకుండా చేస్తామని ఉత్తరకొరియా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఒక వేళ గువాంపై దాడిని అమెరికా అడ్డుకోదలిస్తే.. ఆ దేశ ప్రధాన భూభాగంపై కూడా బాంబులు వేస్తామని ఉత్తరకొరియా మిలటరీ ప్రతినిధి ఒకరు అన్నారు. ఉత్తరకొరియా తాజా ప్రకటనతో ప్రపంచమార్కెట్లు కుదేలవుతున్నాయి. దీంతో ఆ దేశంపై దుందుడుకుతనంతో వ్యాఖ్యలు చేయొద్దని కంపెనీలు అమెరికాను అభ్యర్థిస్తున్నాయి. ట్రంప్ ప్రకటన ఏంటంటే.. మంగళవారం న్యూజెర్సీలో విలేకరుల సమావేశంలో ఉత్తరకొరియాపై ట్రంప్ విరుచుకుపడ్డారు. అమెరికాను ఉద్దేశిస్తూ పదేపదే ప్రకటనలు చేయకపోవడం ఆ దేశానికి మంచిదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఉత్తరకొరియా వరుసగా జరుపుతున్న ఖండాంతర అణు సామర్ధ్య క్షిపణుల పరీక్షలను యూఎస్ ఏకగ్రీవంగా ఖండించింది. ఆ దేశానికి వ్యతిరేకంగా ఈ తీర్మానం రావడం వెనుక అమెరికా హస్తం ఉందని ఉత్తరకొరియా బలంగా నమ్ముతోంది. -
ధూమ్ ధామ్ పార్టీ ఇచ్చిన కిమ్
టోక్యో: ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మంచి మూడ్‌లో ఉన్నారట. ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతమైన తర్వాత దాన్ని తయారు చేసేందుకు కృషి చేసిన వారందరికీ ధూమ్ ధామ్ పార్టీ ఇచ్చారట కిమ్. అంతేకాదు తానూ పార్టీకి హాజరయ్యి పాప్ మ్యూజిక్‌ను విన్నారట. ఈ మేరకు ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఓ రిపోర్టును ప్రచురించింది. కన్సర్ట్‌లో సాంగ్ ఆఫ్ హ్వాసంగ్ రాకెట్, మేక్ అదర్స్ ఎన్వీ అజ్ అనే గీతాలను కూడా ప్లే చేసినట్లు తెలిపింది. కన్సర్ట్‌లో నృత్యం చేసేందుకు మహిళల బ్యాండ్‌ను కిమ్ ఎంపిన చేశారని.. కిమ్ హయాంలో ఇలాంటి చర్య గతంలో ఎన్నడూ జరగలేదని వివరించింది. జులై 4వ తేదీన జరిపిన హ్వాసంగ్-14 క్షిపణి ప్రయోగాన్ని ఉత్తరకొరియా ప్రతిష్టాత్మక విజయంగా భావిస్తోంది. పరీక్ష విజయాన్ని జాతి విజయంగా ఆ దేశం భావిస్తున్నట్లు ప్రముఖ పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. కాగా, ఆదివారం జరిగిన కన్సర్ట్కు హాజరైన వారిలో యూనిఫాంలో ఉన్న వ్యక్తులు కూడా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. -
కొరియన్ పెనిన్సులాపై అమెరికా విమానాల చక్కర్లు
సియోల్: ఖండాంతర క్షిపణి ప్రయోగంతో అమెరికాను చేరగలిగే క్షిపణిని తయారు చేసిన ఉత్తరకొరియాకు ధీటుగా బదులిచ్చేందుకు అమెరికా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దక్షిణ కొరియాలో అమెరికా యుద్ధవిమానాలు ప్రత్యక్ష ఫైర్ డ్రిల్ చేపట్టాయి. ఇందులో భాగంగా ఉత్తర కొరియాకు అతి సమీపంగా వెళ్లిన యుద్ధవిమానాలు కొరియన్ పెనిన్సులాపై కాసేపు చక్కర్లు కొట్టాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలకు కఠిన సమాధానం చెప్పేందుకే ఈ డ్రిల్ చేపట్టినట్లు దక్షిణకొరియా మిలటరీ పేర్కొంది. దక్షిణ కొరియాలోని గువామ్‌లో గల అండర్సన్ ఎయిర్‌బేస్‌లో నాలుగు అమెరికా యుద్ధవిమానాలు, ఒక దక్షిణకొరియా జెట్ ఫైటర్ శనివారం ప్రత్యక్ష ఫైర్ డ్రిల్ చేపట్టాయి. ఇందులో భాగంగా ఉత్తర కొరియా సరిహద్దుకు అతి సమీపానికి వెళ్లిన విమానాలు కొరియన్ పెనిన్సులాపై చక్కర్లు కొట్టి తిరిగి ఎయిర్‌బేస్‌ను చేరుకున్నాయి. గత మంగళవారం ఉత్తరకొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. అత్యంత సామర్థ్యం గల ఈ క్షిపణి తూర్పు సముద్రంలో జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలో పడింది. ఈ క్షిపణికి అమెరికాలోని అలస్కాను చేరే సామర్థ్యం ఉందని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. కాగా.. దీనిపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అమెరికాకు దక్షిణకొరియా షాక్!
సియోల్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దూకుడుతో ప్రపంచానికి షాక్ ఇస్తుంటే.. కొరియా దేశాలు మాత్రం అమెరికాకు షాక్ ఇస్తున్నాయి. ఓ వైపు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికాపై అణుదాడి చేస్తానని వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ అమెరికాకు షాక్ ఇచ్చాడు. ఉత్తరకొరియా సరిహద్దులో ఏర్పాటు చేసిన క్షిపణి దాడిని తిప్పికొట్టగల టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్) వ్యవస్ధను అమెరికా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, అవసరమైన వాటి కన్నా ఎక్కువ సంఖ్యలో వీటిని ఏర్పాటు చేయడంపై విచారణకు ఆదేశించారు మూన్. ఉదారవాదిగా పేరున్న మూన్ తొలుత నుంచి ఉత్తరకొరియాతో చర్చలకు సుముఖంగా ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల నాటి ఆయన మద్దతు దారులు థాడ్ వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఆయన సలహాదారు యోన్ యంగ్ చాన్ ఓ టీవీ కార్యాక్రమంలో మాట్లాడుతూ నాలుగు అదనపు థాడ్ లాంచర్ల ఏర్పాటును అధ్యక్షుడు గుర్తించారని చెప్పారు. అలా ఎందుకు చేయాల్సివచ్చిందో తెలుసుకోవాలని దర్యాప్తుకు ఆదేశించారని తెలిపారు. వీటిని ఎందుకు తెప్పించారన్న దానిపై రక్షణ శాఖ సీనియర్ అధికారులు తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆయన అన్నారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ థాడ్ వ్యవస్థల ఏర్పాటుకు దక్షిణ కొరియా సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో మూన్ నిర్ణయం వెలువడటం గమనార్హం.