ఏంజెలినో అల్ఫానో, ఇటలీ విదేశాంగ మంత్రి
రోమ్ : ఉత్తర కొరియాను ఒంటరి చేసే పనులు వేగవంతం అవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌తోపాటు దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాలు ఆ దేశం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఆ వరుసలతో తాజాగా ఇటలీ చేరింది. తమ దేశానికి కొత్తగా వస్తున్న ఉత్తర కొరియా రాయబారి వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. తాము చెబుతున్న వినకుండా అణుపరీక్షలు నిర్వహిస్తున్న కిమ్ జాంగ్ ఉన్ తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఏంజెలినో అల్ఫానో ఇటలీ డెయిలీ లా రిపబ్లికాకు తెలియజేశారు.
ఉత్తర కొరియా రాయబారిని వెనక్కి పంపించడాన్ని ఆ దేశం అర్థం చేసుకుంటుందని తాము భావిస్తున్నామన్నారు. ఒక వేళ ఉత్తర కొరియా తన వైఖరిని మార్చుకోకుంటే తమ నిర్ణయం సరైనదే అని ఆ దేశానికి అనిపించేలా చేయడమే తమ ఉద్దేశం అన్నారు. ఇక ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. దాదాపు ఏడాదిపాటు ఖాళీగా ఉన్న రాయబారి పదవిని ఈ ఏడాది జూలైలోనే కిమ్ నింపాడు. రోమ్‌కు తమ దేశ ప్రతినిధిగా మున్ జాంగ్ నామ్ అనే వ్యక్తిని నియమించారు. ప్రస్తుతం ఆయననే వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఇటలీ ప్రభుత్వం ఆదేశించింది.