అమెరికా ముందు ఆరు మార్గాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మాటలు తూటాలై పేలుతుండటంతో ప్రపంచమంతటా యుద్ధమేఘాల భయం అలముకుంది. పలుమార్లు అమెరికాపై అణుదాడి చేస్తామని హెచ్చరించిన ఉత్తరకొరియా నియంత కిమ్ రక్తం ఎప్పుడూ మరుగుతూనే ఉంటుందేమో. అందుకు ప్రతిగా వయసులో పెద్దవాడైన ట్రంప్ కూడా సంయమనం పాటించకుండా కామెంట్లు చేస్తున్నారు.
గత యుద్ధాల నుంచి పాశ్చాత్య దేశాలు నేర్వాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. ఆపదల సమయంలో సంయమనం పాటించి వ్యూహం రచించక నష్టపోయిన దాఖలాలు కోకొల్లలు. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఉత్తరకొరియాను అదుపు చేయడానికి అమెరికా ముందు ఆరు మార్గాలు ఉన్నాయని ఆక్సఫర్డ్‌కు చెందిన క్రైసిస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మార్క్ ఆల్మండ్ చెప్పారు. వాటిని ఓ సారి చూద్దాం.
భారీ దాడికి పోవద్దు
అణు ఆయుధాలను తయారు చేస్తున్న ఉత్తరకొరియాపై 1994లో అమెరికా అధ్యక్షుడు క్లింటన్ బాంబర్స్‌తో దాడి చేయించారు. అయితే, అప్పుడు ఉత్తరకొరియా పరిస్ధితి వేరు. ఆ దాడిలో తమ స్ధావరాలను కాపాడుకోలేక ఆ దేశం చతికిలపడింది. కానీ నేటి ఉత్తరకొరియా ఆయుధసంపత్తిలో ఆరి తేరింది.
జపాన్, దక్షిణకొరియా, గ్వామ్‌లలో ఉన్న వాయుదళంతో అమెరికా ఉత్తరకొరియా అణుస్ధావరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే క్షిపణులను అప్పటికప్పుడు తరలించగల శక్తిని జోంగ్ దేశం సాధించింది. అంతేకాదు ఉత్తరకొరియా తాజాగా తయారుచేసుకున్న క్షిపణులను కొద్ది సమయంలోనే సిద్ధం చేసి ప్రయోగించొచ్చు. కాబట్టి, భారీ ఎయిర్‌స్ట్రైక్‌తో ఉత్తరకొరియాను అడ్డుకుందామని అనుకుంటే అమెరికా బొక్కబొర్లా పడటం ఖాయం.
పూర్తి సైన్యంతో దిగాల్సిందే..
తొలి ఉత్తరకొరియా యుద్ధంలో ఆ దేశానికి నేవీ లేదు. కాబట్టి అమెరికా బలగాలు సముద్రతీరం నుంచి ప్యాంగ్‌యాంగ్‌కు వెళ్లడానికి పెద్దగా కష్టపడాల్సిరాలేదు. కానీ, ప్రస్తుత పరిస్ధితి మారిపోయింది. ఉత్తరకొరియా పూర్తిస్ధాయిలో సైన్యాన్ని నిర్మించుకుంది. ఇలాంటి దశలో అమెరికా కేవలం దక్షిణకొరియాలో ఉన్న తన సైన్యాన్ని వినియోగించి యుద్ధరంగంలోకి దిగితే ఓటమి చవిచూడక తప్పదు.
ఇలాంటి స్ధితిలో అమెరికా ఆప్ఘనిస్తాన్, ఇరాన్‌లలో మొహరించిన తన సైన్యాన్నంతటినీ ఉత్తరకొరియాకు తరలించాలి. ఇలా చేయడం అసాధ్యం. కాబట్టి అమెరికా దక్షిణకొరియాకు ఉన్న ఆరు లక్షల యాభై వేల మంది సైన్యాన్ని యుద్ధానికి పంపాలని కోరే అవకాశం ఉంది. కానీ దక్షిణకొరియా అమెరికా అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించే అవకాశం ఉంది.
ఎందుకంటే.. అమెరికాకు సైన్యాన్ని ఇవ్వడం వల్ల ఉత్తరకొరియా దక్షిణకొరియాపై అణుదాడి చేయడం ఖాయం. ఇకపోతే చైనా. అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించాలని చూస్తున్న ఆ దేశానికి.. తమ ప్రాంతంలోని ఓ దేశంపై అమెరికా దండెత్తడం రుచించకపోవచ్చు. కాబట్టి ఉత్తరకొరియాపై యుద్ధాని కంటే ముందు అమెరికా.. చైనాతో చర్చించాల్సివుంటుంది. లేకుంటే ఉత్తరకొరియా-అమెరికాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు.
వీటన్నింటిని దాటి అమెరికా భారీ సైనిక దళంతో ఉత్తరకొరియాలో ప్రవేశించాలని చూసినా.. జరిగే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కిమ్ వద్ద దాదాపు 60కు పైగా అణు ఆయుధాలు, లెక్కకు మించిన రసాయన, జీవ ఆయుధాలు ఉన్నాయి.
సైన్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి
ఉత్తరకొరియా అణు ఆయుధ స్ధావరాలను నాశనం చేయడం ఒక్కటే అమెరికాను విజయతీరాలకు చేర్చదు. రక్త దాహానికి అలవాటు పడ్డ కిమ్ లాంటి నియంతను నామరూపాల్లేకుండా చేయాలంటే ఆ దేశ సైన్యాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించగలగాలి. కనిపించిన సైనికుడిని నరికిపారేసి మారణహోమం సృష్టించాలి.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, అతని కీలక కమాండర్లు కౌంటర్ అటాక్‌కు ప్లాన్ చేసే లోపే స్మార్ట్ బాంబు సాయంతో వారిని మట్టుబెట్టగలగాలి. ఒకవేళ కిమ్‌ను అంతం చేయడం మిస్ అయితే, పొరుగుదేశాలైన జపాన్, దక్షిణకొరియా, ఉత్తరకొరియా రేంజ్‌కు అందుబాటులో ఉన్న ప్రతి బేస్ సర్వనాశనం అవుతుంది. ఒకవేళ అమెరికా-దక్షిణకొరియా బలగాలు ఉత్తరకొరియాను తమ అదుపులోకి తీసుకున్నా.. గెరిల్లా యుద్ధాలు మాత్రం ఆగవు. పెద్ద సంఖ్యలో ఉత్తరకొరియన్లు చైనాకు శరణార్థులుగా వెళ్లే అవకాశం ఉంటుంది.
అమెరికా అణు దాడి
అగ్రరాజ్యం అణు దాడే శరణ్యంగా భావించే ఉత్తరకొరియా ప్రపంచపటం మీద లేకుండా చేస్తే మిగిలిన ప్రపంచదేశాలు ఆత్మరక్షణలో పడతాయి. అంతేకాదు అమెరికాతో ఏర్పడిన సైనిక కూటములుగా ఏర్పడిన దేశాలు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాయి. చైనా, రష్యాలాంటి దేశాలు భారీ స్ధాయిలో రక్షణ బడ్జెట్‌ను పెంచి ఆయుధసంపత్తిని పెంచుకుంటాయి.
చైనాపై ఒత్తిడి
చైనాను బతిమాలో బామాలో ఉత్తరకొరియాపై ఒత్తిడి తీసుకొద్దామని ట్రంప్ గతంలో ప్రయత్నించారు. కానీ అవి సఫలం కాలేదు. మరికొంత ఒత్తిడి తెచ్చేందుకు చైనాను హెచ్చరించారు కూడా. అయినా ప్రయోజనం లేదు. కారణం ఉత్తరకొరియాతో చైనాకు ఉన్న సత్సంబంధాలు కూడా అంతంతమాత్రమే. చైనాతో అంటి ముట్టనట్లు ఉంటున్న ఉత్తరకొరియా.. తామరకుపై నీటి బిందువు వలే ఎప్పుడైనా జారిపోయేందుకు సిద్ధంగా ఉంది.
అంతర్జాతీయ చర్య
ప్యాంగ్‌యాంగ్ పదేళ్ల క్రితం అణు పరీక్షలు చేయడం ప్రారంభించిన నాటి నుంచే యూఎన్ భద్రతామండలి ఆ దేశానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూనే ఉంది. ఈ విధంగా చూస్తే అమెరికాకు, రష్యా, చైనాల మద్దతు కూడా బలంగా ఉంది. ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించేందుకు ఆ దేశాలు వెనుకాడటం లేదు. బాహ్య ప్రపంచం నుంచి ఉత్తరకొరియాకు వాణిజ్యపరంగా సహాకారం అందిస్తుంది కూడా ఈ రెండు దేశాలు కావడం గమనార్హం. వాణిజ్యాన్ని నిలిపివేయాలనే తీర్మానం చేయడం వల్ల ఉత్తరకొరియా అతలాకుతలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలా చేస్తే రష్యా, చైనాల మీద కిమ్ అణుదాడికి వెనుకాడకపోవచ్చు.