గ్వామ్ లక్ష్యంతో.. జపాన్ మీదుగా: కిమ్ దేశం
సాక్షి, సియోల్/వాషింగ్టన్: జపాన్ ఉత్తర భూభాగం మీదుగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోకి మధ్య తరహా శ్రేణి క్షిపణి(హస్వాంగ్-12)ని పరీక్షించినట్లు ఉత్తరకొరియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాల నేపథ్యంలో తాము ఈ పరీక్షను నిర్వహించినట్లు వెల్లడించింది. ప్యాంగ్‌యాంగ్ నుంచి ఈ పరీక్షను నిర్వహించాలని అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు జారీ చేశారని తెలిపింది.
జపాన్‌కు ఆవల ఉన్న ఉత్తర పసిఫిక్ జలాల్లోకి క్షిపణిని పరీక్షించాలని కిమ్ ఆదేశించినట్లు వివరించింది. గ్వామ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకునే జపాన్ మీదుగా క్షిపణిని పరీక్షించామని వెల్లడించింది. కాగా, రాజధాని ప్యాంగ్‌యాంగ్ నుంచి ఉత్తరకొరియా క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి. పసిఫిక్ మహా సముద్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మరిన్ని క్షిపణి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది.
హస్వాంగ్-12 రకానికి చెందిన నాలుగు క్షిపణులను గ్వామ్‌ను సర్వనాశనం చేసేందుకు వినియోగిస్తామని, ఇందుకు వ్యూహం రచించామని గతంలో కిమ్.. అమెరికాను హెచ్చరించిన విషయం తెలిసిందే. కిమ్-ట్రంప్‌ల వాగ్యుద్ధం తర్వాత గ్వామ్‌పై దాడిని ఉత్తరకొరియా విరమించుకుంది. కొరియా యుద్ధం అనంతరం పసిఫిక్ మహా సముద్రంలో గల గ్వామ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ 1.60 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అమెరికాకు చెందిన నేవీ, ఎయిర్‌ఫోర్స్ బేస్‌లు ఇక్కడున్నాయి.
ట్రంప్ ఏమన్నారంటే...
ఉత్తరకొరియా తాజా ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. ఉత్తరకొరియా ఎంత రెచ్చిపోతే అంతలా నాశనం అవుతుందని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ ఉత్తరకొరియాను ఒంటరి చేస్తాయని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కిమ్ దేశాన్ని కట్టడి చేసేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.