Guam
-
అణు దాడికి రంగం సిద్ధం..!!
ప్యాంగ్యాంగ్ : అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, గ్వామ్ ద్వీపాలే లక్ష్యంగా ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అణు బాంబులు విసిరేందుకు సిద్ధమయ్యారనే రిపోర్టులు వస్తున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లోని 15 ప్రదేశాలపై అణు దాడి జరగొచ్చని యూరోపియన్ కమిషన్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్(ఈయూఎఫ్ఆర్) పేర్కొంది. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటనలను పలుమార్లు నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు చెప్పింది. ఉత్తరకొరియా ఎంచుకున్న ప్రదేశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోకొంత గుర్తింపు కలిగినవేనని తెలిపింది. ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలో ఉన్న సోర్సెస్ సాయంతో ఈ సమాచారం సంపాదించగలిగినట్లు వివరించింది. ఉత్తర కొరియా లక్షిత ప్రాంతాలు ఇలా ఉన్నాయి. అమెరికాలోని ప్రదేశాలు : వైట్‌హౌస్, పెంటగాన్, న్యూయార్క్, మన్‌హట్టన్, అమెరికా ముఖ్య నగరాలు జపాన్‌లోని ప్రదేశాలు : మిసావా, టొక్యో, ఒసాకా, యోకోహామా, క్యోటో దక్షిణ కొరియాలోని ప్రదేశాలు : సియోల్, బుసాన్, గ్యాంన్నెయంగ్ ఈ రిపోర్టును బయటకు వెలువరించడంపై కూడా యూరోపియన్ యూనియన్ ఫారిన్ రిలేషన్స్ వివరణ ఇచ్చింది. ఇలాంటి వాటిని బయటపెట్టడం వల్ల ఉత్తరకొరియాలో మళ్లీ కదలికలు మొదలవుతాయని చెప్పింది. అలాంటి పరిస్థితి ఆ దేశం దాడికి ఎప్పుడు దిగుతుందో తెలిసే అవకాశం కలుగుతుందని వివరించింది. -
గ్వామ్ లక్ష్యంతో.. జపాన్ మీదుగా: కిమ్ దేశం
సాక్షి, సియోల్/వాషింగ్టన్: జపాన్ ఉత్తర భూభాగం మీదుగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోకి మధ్య తరహా శ్రేణి క్షిపణి(హస్వాంగ్-12)ని పరీక్షించినట్లు ఉత్తరకొరియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాల నేపథ్యంలో తాము ఈ పరీక్షను నిర్వహించినట్లు వెల్లడించింది. ప్యాంగ్యాంగ్ నుంచి ఈ పరీక్షను నిర్వహించాలని అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు జారీ చేశారని తెలిపింది. జపాన్‌కు ఆవల ఉన్న ఉత్తర పసిఫిక్ జలాల్లోకి క్షిపణిని పరీక్షించాలని కిమ్ ఆదేశించినట్లు వివరించింది. గ్వామ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకునే జపాన్ మీదుగా క్షిపణిని పరీక్షించామని వెల్లడించింది. కాగా, రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి ఉత్తరకొరియా క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి. పసిఫిక్ మహా సముద్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మరిన్ని క్షిపణి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. హస్వాంగ్-12 రకానికి చెందిన నాలుగు క్షిపణులను గ్వామ్‌ను సర్వనాశనం చేసేందుకు వినియోగిస్తామని, ఇందుకు వ్యూహం రచించామని గతంలో కిమ్.. అమెరికాను హెచ్చరించిన విషయం తెలిసిందే. కిమ్-ట్రంప్‌ల వాగ్యుద్ధం తర్వాత గ్వామ్‌పై దాడిని ఉత్తరకొరియా విరమించుకుంది. కొరియా యుద్ధం అనంతరం పసిఫిక్ మహా సముద్రంలో గల గ్వామ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ 1.60 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అమెరికాకు చెందిన నేవీ, ఎయిర్‌ఫోర్స్ బేస్‌లు ఇక్కడున్నాయి. ట్రంప్ ఏమన్నారంటే... ఉత్తరకొరియా తాజా ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. ఉత్తరకొరియా ఎంత రెచ్చిపోతే అంతలా నాశనం అవుతుందని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ ఉత్తరకొరియాను ఒంటరి చేస్తాయని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కిమ్ దేశాన్ని కట్టడి చేసేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
కిమ్ జాంగ్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్ : నిన్న మొన్నటి వరకూ అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. కిమ్ తెలివైన, సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ట్రంప్ అభినందించారు. అమెరికా భూభాగమైన గువామ్ ద్వీపంపై దాడి చేస్తామని గతవారం ఉత్తర కొరియా తీవ్ర హెచ్చరికలు చేయడంతో ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డిన విషయం తెలిసిందే. అయితే క్షిపణి దాడి విషయంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గింది. క్షిపణి ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని, అమెరికా మరిన్ని నిర్లక్ష్య చర్యలు చేపట్టేంతవరకు వరకు ఎదురు చూస్తామని ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా నిర్ణయంపై స్పందించిన ట్రంప్... కిమ్ తెలివైన నిర్ణయం తీసుకున్నారని పొగడటమే కాకుండా... క్షిపణి దాడి ఆలోచన విపత్కరమే గాక, ఆమోదయోగ్యం కానిది కూడా అని ట్వీట్ చేశారు. దాంతో అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. Kim Jong Un of North Korea made a very wise and well reasoned decision. The alternative would have been both catastrophic and unacceptable! — Donald J. Trump (@realDonaldTrump) August 16, 2017 -
వార్ రూమ్‌లో కిమ్: 17 నిమిషాల్లో గ్వామ్ ముక్కలు!
ప్యాంగ్యాంగ్: గ్వామ్ ద్వీపాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా-ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు పేలిన తర్వాత పసిఫిక్ సముద్ర జలాల్లో ఉన్న అమెరికాకు చెందిన గ్వామ్ ద్వీపంపై అణు దాడి చేస్తామని, అందుకు తగిన ప్రణాళికను కూడా సిద్ధం చేశామని కిమ్ రాజ్యం ప్రకటించిన విషయం తెలిసిందే. గ్వామ్‌పై దాడికి కిమ్ నేతృత్వంలోని కీలక అధికారులు సమావేశమైన 'వార్ రూమ్' చిత్రాలను ఆ దేశ మీడియా బయటకు విడుదల చేసింది. ఓ చిత్రంలో గ్వామ్ ద్వీపానికి సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను కిమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వెనుక భాగంలో కొరియా, జపాన్ దేశాల సముద్రజలాల్లో ఉన్న అమెరికా బేస్‌లకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. కిమ్‌కు సహకరిస్తున్న వారిలో ఉత్తరకొరియా రాకెట్ పితామహుడు కిమ్ జాంగ్ సిక్ కూడా ఉన్నారు. ఉత్తరకొరియా అణు శక్తి కలిగిన క్షిపణులను తయారు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఉత్తరకొరియాకు తూర్పున ఉన్న ఓ నావల్ బేస్ నుంచి జపాన్ మీదుగా గ్వామ్‌పై దాడి చేసేందుకు కిమ్ వ్యూహం రచించారని దక్షిణ కొరియాకు చెందిన మిలటరీ నిపుణుడు ఒకరు తెలిపారు. నాలుగు మధ్యతరహా శ్రేణి క్షిపణులను ఉత్తరకొరియా గ్వామ్ మీద ప్రయోగిస్తుందని చెప్పారు. ఇవి 17 నిమిషాలు పాటు 3,356 కిలోమీటర్లు ప్రయాణించి గ్వామ్ ద్వీపానికి 40 కిలోమీటర్ల దూరంలో సముద్ర జలాలను ఢీ కొంటాయని వివరించారు. అయితే, అమెరికా సోమవారం ఉత్తరకొరియా విషయంలో ఆచితూచి వ్యవహరించినట్లు కనిపించింది. దీంతో మరికొన్ని రోజుల పాటు గ్వామ్‌పై దాడి చేయాలనే ఆలోచనను ఉత్తరకొరియా పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. -
అమెరికా ముందు ఆరు మార్గాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మాటలు తూటాలై పేలుతుండటంతో ప్రపంచమంతటా యుద్ధమేఘాల భయం అలముకుంది. పలుమార్లు అమెరికాపై అణుదాడి చేస్తామని హెచ్చరించిన ఉత్తరకొరియా నియంత కిమ్ రక్తం ఎప్పుడూ మరుగుతూనే ఉంటుందేమో. అందుకు ప్రతిగా వయసులో పెద్దవాడైన ట్రంప్ కూడా సంయమనం పాటించకుండా కామెంట్లు చేస్తున్నారు. గత యుద్ధాల నుంచి పాశ్చాత్య దేశాలు నేర్వాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. ఆపదల సమయంలో సంయమనం పాటించి వ్యూహం రచించక నష్టపోయిన దాఖలాలు కోకొల్లలు. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఉత్తరకొరియాను అదుపు చేయడానికి అమెరికా ముందు ఆరు మార్గాలు ఉన్నాయని ఆక్సఫర్డ్‌కు చెందిన క్రైసిస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మార్క్ ఆల్మండ్ చెప్పారు. వాటిని ఓ సారి చూద్దాం. భారీ దాడికి పోవద్దు అణు ఆయుధాలను తయారు చేస్తున్న ఉత్తరకొరియాపై 1994లో అమెరికా అధ్యక్షుడు క్లింటన్ బాంబర్స్‌తో దాడి చేయించారు. అయితే, అప్పుడు ఉత్తరకొరియా పరిస్ధితి వేరు. ఆ దాడిలో తమ స్ధావరాలను కాపాడుకోలేక ఆ దేశం చతికిలపడింది. కానీ నేటి ఉత్తరకొరియా ఆయుధసంపత్తిలో ఆరి తేరింది. జపాన్, దక్షిణకొరియా, గ్వామ్లలో ఉన్న వాయుదళంతో అమెరికా ఉత్తరకొరియా అణుస్ధావరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే క్షిపణులను అప్పటికప్పుడు తరలించగల శక్తిని జోంగ్ దేశం సాధించింది. అంతేకాదు ఉత్తరకొరియా తాజాగా తయారుచేసుకున్న క్షిపణులను కొద్ది సమయంలోనే సిద్ధం చేసి ప్రయోగించొచ్చు. కాబట్టి, భారీ ఎయిర్స్ట్రైక్తో ఉత్తరకొరియాను అడ్డుకుందామని అనుకుంటే అమెరికా బొక్కబొర్లా పడటం ఖాయం. పూర్తి సైన్యంతో దిగాల్సిందే.. తొలి ఉత్తరకొరియా యుద్ధంలో ఆ దేశానికి నేవీ లేదు. కాబట్టి అమెరికా బలగాలు సముద్రతీరం నుంచి ప్యాంగ్యాంగ్కు వెళ్లడానికి పెద్దగా కష్టపడాల్సిరాలేదు. కానీ, ప్రస్తుత పరిస్ధితి మారిపోయింది. ఉత్తరకొరియా పూర్తిస్ధాయిలో సైన్యాన్ని నిర్మించుకుంది. ఇలాంటి దశలో అమెరికా కేవలం దక్షిణకొరియాలో ఉన్న తన సైన్యాన్ని వినియోగించి యుద్ధరంగంలోకి దిగితే ఓటమి చవిచూడక తప్పదు. ఇలాంటి స్ధితిలో అమెరికా ఆప్ఘనిస్తాన్, ఇరాన్లలో మొహరించిన తన సైన్యాన్నంతటినీ ఉత్తరకొరియాకు తరలించాలి. ఇలా చేయడం అసాధ్యం. కాబట్టి అమెరికా దక్షిణకొరియాకు ఉన్న ఆరు లక్షల యాభై వేల మంది సైన్యాన్ని యుద్ధానికి పంపాలని కోరే అవకాశం ఉంది. కానీ దక్షిణకొరియా అమెరికా అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే.. అమెరికాకు సైన్యాన్ని ఇవ్వడం వల్ల ఉత్తరకొరియా దక్షిణకొరియాపై అణుదాడి చేయడం ఖాయం. ఇకపోతే చైనా. అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించాలని చూస్తున్న ఆ దేశానికి.. తమ ప్రాంతంలోని ఓ దేశంపై అమెరికా దండెత్తడం రుచించకపోవచ్చు. కాబట్టి ఉత్తరకొరియాపై యుద్ధాని కంటే ముందు అమెరికా.. చైనాతో చర్చించాల్సివుంటుంది. లేకుంటే ఉత్తరకొరియా-అమెరికాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు. వీటన్నింటిని దాటి అమెరికా భారీ సైనిక దళంతో ఉత్తరకొరియాలో ప్రవేశించాలని చూసినా.. జరిగే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కిమ్ వద్ద దాదాపు 60కు పైగా అణు ఆయుధాలు, లెక్కకు మించిన రసాయన, జీవ ఆయుధాలు ఉన్నాయి. సైన్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి ఉత్తరకొరియా అణు ఆయుధ స్ధావరాలను నాశనం చేయడం ఒక్కటే అమెరికాను విజయతీరాలకు చేర్చదు. రక్త దాహానికి అలవాటు పడ్డ కిమ్ లాంటి నియంతను నామరూపాల్లేకుండా చేయాలంటే ఆ దేశ సైన్యాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించగలగాలి. కనిపించిన సైనికుడిని నరికిపారేసి మారణహోమం సృష్టించాలి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, అతని కీలక కమాండర్లు కౌంటర్ అటాక్‌కు ప్లాన్ చేసే లోపే స్మార్ట్ బాంబు సాయంతో వారిని మట్టుబెట్టగలగాలి. ఒకవేళ కిమ్‌ను అంతం చేయడం మిస్ అయితే, పొరుగుదేశాలైన జపాన్, దక్షిణకొరియా, ఉత్తరకొరియా రేంజ్‌కు అందుబాటులో ఉన్న ప్రతి బేస్ సర్వనాశనం అవుతుంది. ఒకవేళ అమెరికా-దక్షిణకొరియా బలగాలు ఉత్తరకొరియాను తమ అదుపులోకి తీసుకున్నా.. గెరిల్లా యుద్ధాలు మాత్రం ఆగవు. పెద్ద సంఖ్యలో ఉత్తరకొరియన్లు చైనాకు శరణార్థులుగా వెళ్లే అవకాశం ఉంటుంది. అమెరికా అణు దాడి అగ్రరాజ్యం అణు దాడే శరణ్యంగా భావించే ఉత్తరకొరియా ప్రపంచపటం మీద లేకుండా చేస్తే మిగిలిన ప్రపంచదేశాలు ఆత్మరక్షణలో పడతాయి. అంతేకాదు అమెరికాతో ఏర్పడిన సైనిక కూటములుగా ఏర్పడిన దేశాలు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాయి. చైనా, రష్యాలాంటి దేశాలు భారీ స్ధాయిలో రక్షణ బడ్జెట్‌ను పెంచి ఆయుధసంపత్తిని పెంచుకుంటాయి. చైనాపై ఒత్తిడి చైనాను బతిమాలో బామాలో ఉత్తరకొరియాపై ఒత్తిడి తీసుకొద్దామని ట్రంప్ గతంలో ప్రయత్నించారు. కానీ అవి సఫలం కాలేదు. మరికొంత ఒత్తిడి తెచ్చేందుకు చైనాను హెచ్చరించారు కూడా. అయినా ప్రయోజనం లేదు. కారణం ఉత్తరకొరియాతో చైనాకు ఉన్న సత్సంబంధాలు కూడా అంతంతమాత్రమే. చైనాతో అంటి ముట్టనట్లు ఉంటున్న ఉత్తరకొరియా.. తామరకుపై నీటి బిందువు వలే ఎప్పుడైనా జారిపోయేందుకు సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ చర్య ప్యాంగ్యాంగ్ పదేళ్ల క్రితం అణు పరీక్షలు చేయడం ప్రారంభించిన నాటి నుంచే యూఎన్ భద్రతామండలి ఆ దేశానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూనే ఉంది. ఈ విధంగా చూస్తే అమెరికాకు, రష్యా, చైనాల మద్దతు కూడా బలంగా ఉంది. ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించేందుకు ఆ దేశాలు వెనుకాడటం లేదు. బాహ్య ప్రపంచం నుంచి ఉత్తరకొరియాకు వాణిజ్యపరంగా సహాకారం అందిస్తుంది కూడా ఈ రెండు దేశాలు కావడం గమనార్హం. వాణిజ్యాన్ని నిలిపివేయాలనే తీర్మానం చేయడం వల్ల ఉత్తరకొరియా అతలాకుతలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలా చేస్తే రష్యా, చైనాల మీద కిమ్ అణుదాడికి వెనుకాడకపోవచ్చు. -
దూసుకెళ్లిన అమెరికా యుద్ధవిమానాలు
వాషింగ్టన్: పసిఫిక్ మహాసముద్రంలోని గువాం ద్వీపం మీదుగా అమెరికా యుద్ధవిమానాలు దూసుకెళ్లాయి. గువాంపై ఉత్తరకొరియా అణుదాడి చేసే ప్లాన్‌ను రచిస్తున్నామని ప్రకటించక ముందే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు సోమవారం అత్యవసరంగా సమావేశం అయ్యాయి. భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దాదాపు 10 గంటల పాటు అమెరికాకు చెందిన సూపర్సోనిక్ బాంబర్ జెట్లు గువాం మీదుగా పలుమార్లు గాల్లో చక్కర్లుకొట్టాయి. దాడి జరిగితే అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకోసమే 10 గంటలపాటు పైలట్లు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. ఉత్తరకొరియా ఆలోచనను ముందుగానే పసిగట్టిన అగ్రరాజ్యం ప్రత్యర్థిని తోకముడిచేలా చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ చూడనివిధంగా అమెరికా విశ్వరూపాన్ని యుద్ధంలో ఉత్తరకొరియా చూస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా వ్యూహానికి అద్దంపడుతున్నాయి. ఈ సమావేశం జరిగిన తర్వాతే ట్రంప్ న్యూ జెర్సీలో ఉత్తరకొరియాపై కామెంట్లు చేశారు. కాగా, గువాం గవర్నర్ అమెరికాను యుద్ధంలో గెలుస్తుందని బుధవారం వ్యాఖ్యానించారు. గువాంపై దాడి చేసేందుకు ఉత్తరకొరియా దాదాపు 60 న్యూక్లియర్ వార్ హెడ్లను సిద్ధం చేసిందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. -
అణు దాడి చేయనున్న ఉత్తరకొరియా!
సియోల్/న్యూజెర్సీ: పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధీనంలో ఉన్న ఓ ద్వీపంపై అణుదాడి చేయడానికి ఉత్తరకొరియా పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా పేర్కొంది. ఉత్తరకొరియాకు 2,128 మైళ్ల దూరంలో ఉన్న గువాం ద్వీపంపై దాడి చేయన్నట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉత్తరకొరియాపై చేసిన వ్యాఖ్యలే దాడి నిర్ణయానికి కారణమని వెల్లడించింది. గువాం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపం. ఈ ద్వీప జనాభా కేవలం ఒక లక్షా అరవై వేలు. దీని తీరంలో అమెరికాకు చెందిన సబ్ మెరైన్ల స్క్వాడ్రన్, ఒక ఎయిర్‌బేస్, కోస్ట్ గార్డు గ్రూప్‌లు ఉన్నాయి. వాటన్నింటిని నాశనం చేసేందుకు పక్కావ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఉత్తరకొరియా చెప్పింది. తమ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ ఆమోదించిన మరుక్షణమే.. గువాంను ప్రపంచపటంలో లేకుండా చేస్తామని ఉత్తరకొరియా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఒక వేళ గువాంపై దాడిని అమెరికా అడ్డుకోదలిస్తే.. ఆ దేశ ప్రధాన భూభాగంపై కూడా బాంబులు వేస్తామని ఉత్తరకొరియా మిలటరీ ప్రతినిధి ఒకరు అన్నారు. ఉత్తరకొరియా తాజా ప్రకటనతో ప్రపంచమార్కెట్లు కుదేలవుతున్నాయి. దీంతో ఆ దేశంపై దుందుడుకుతనంతో వ్యాఖ్యలు చేయొద్దని కంపెనీలు అమెరికాను అభ్యర్థిస్తున్నాయి. ట్రంప్ ప్రకటన ఏంటంటే.. మంగళవారం న్యూజెర్సీలో విలేకరుల సమావేశంలో ఉత్తరకొరియాపై ట్రంప్ విరుచుకుపడ్డారు. అమెరికాను ఉద్దేశిస్తూ పదేపదే ప్రకటనలు చేయకపోవడం ఆ దేశానికి మంచిదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఉత్తరకొరియా వరుసగా జరుపుతున్న ఖండాంతర అణు సామర్ధ్య క్షిపణుల పరీక్షలను యూఎస్ ఏకగ్రీవంగా ఖండించింది. ఆ దేశానికి వ్యతిరేకంగా ఈ తీర్మానం రావడం వెనుక అమెరికా హస్తం ఉందని ఉత్తరకొరియా బలంగా నమ్ముతోంది. -
భారత్‌కు పరాభవం
► గ్వామ్ చేతిలో 1-2తో ఓటమి ► ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్ టామునింగ్ (గ్వామ్) : ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టుకు అవమానకర ఓటమి ఎదురైంది. కనీసం 2 లక్షల జనాభా కూడా లేని గ్వామ్ అనే చిన్న దీవి జట్టుచేతిలో 1-2 తేడాతో భారత్ పరాజయం పాలైంది. మంగళవారం తమ దేశంలోనే జరిగిన ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అంచనాలు లేని గ్వామ్ చెలరేగింది. గత గురువారం తుర్కెమెనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ గ్వామా 1-0తో గెలిచింది. దీంతో తమ గ్రూప్ ‘డి’లో అగ్రస్థానం దక్కించుకుంది. ఆసియా నుంచి ఫుట్‌బాల్ ఆడుతున్న దేశాల్లో గ్వామ్ అతి చిన్నది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 141వ ర్యాంకులో ఉన్న భారత్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. భారత్‌కన్నా 33 స్థానాలు వెనుకబడిన గ్వామ్ తరఫున బ్రెండన్ మెక్‌డొనాల్డ్ (38వ నిమిషంలో), ట్రావిస్ నిక్లా (62వ ని.) గోల్స్ చేయగా.. భారత్ నుంచి కెప్టెన్ సునీల్ చెత్రి ఇంజ్యూరీ సమయంలో (90+3) ఓదార్పు గోల్ చేశాడు. ఇది చెత్రికి 50వ అంతర్జాతీయ గోల్ కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో ఒమన్ చేతిలో ఓడిన జట్టునే భారత కోచ్ బరిలోకి దించారు. అయితే ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసుకున్న భారత్ తగిన మూల్యం చెల్లించుకుంది. 38వ నిమిషంలో రియాన్ గై లాంగ్ పాస్‌ను అందుకున్న మెక్‌డొనాల్డ్ హెడ్ గోల్‌తో శుభారంభం అందించాడు. ద్వితీయార్ధంలో భారత్ తమ ఆటగాళ్లను మార్చినా ఆటతీరులో మార్పు రాలేదు. 62వ నిమిషంలో తన సోదరుడు షాన్ అందించిన పాస్‌ను నిక్లా గోల్ చేసి స్కోరును 2-0కి పెంచాడు. ఇక చిట్టచివర్లో చెత్రి గోల్‌తో భారత్ కాస్త పరువు నిలుపుకుంది. -
2 వేల ఎలుకలతో.. అమెరికా పాముల వేట!
ఒకటి కాదు రెండు కాదు చనిపోయిన రెండువేల చిట్టెలుకల్ని కార్డ్‌బోర్డు పారాచ్యూట్స్లలో ఉంచి హెలీకాప్టర్ల ద్వారా ఓ దీవిలో విడిచిపెట్టారు. వీటి ద్వారా విషతుల్యం చేసి పాముల్ని చంపాలన్నది పథకం. ఇది చదువుతుంటే ఏ యానిమేషన్ చిత్రం కోసమే ఈ సీన్ తీసుంటారని భావిస్తారు. అయితే ఇది నిజంగా జరిగిన కథే. విషయమేంటంటే... అమెరికా ఆధీనంలో ఉన్న గామ్ దీవిలో పాములు పెద్ద సమస్యగా తయారయ్యాయి. అరుదైన పక్షు జాతుల్ని సంహరించడంతో పాటు పవర్‌గ్రిడ్‌కు పెనుసవాల్‌గా మారుతున్నాయి. దీంతో పాముల్ని హతమార్చేందుకు అమెరికా ప్రభుత్వం ఈ ఆపరేషన్ చేపట్టింది. పాములు చనిపోయిన ఎలుకల్ని తినడం వల్ల చనిపోతాయని, ఇతర జంతువులకు పెద్దగా హానీ ఉండదని భావిస్తున్నారు. చనిపోయిన ఎలుకల్ని తక్కువ ఎత్తు నుంచి హెలీకాప్టర్ల ద్వారా అడవిలో జారవిడిచినట్టు గామ్ వ్యవసాయ శాఖ పర్యవేక్షకుడు డాన్ వైస్ తెలిపారు. ప్రతి ఎలుకని ఒక్కో టిష్యూ పేపర్, కార్డ్‌బోర్డుతో చేసిన చిన్న పారాచ్యూట్‌లో ఉంచుతారు. టిష్యూ పేపర్ కంటే కార్డ్వబోర్డు పెద్దగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. తద్వారా ఇవి అడవిలో చెట్ల వద్ద వేలాడుకుని ఉండటం వల్ల పాములు తినే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్ ఏ మేరకు విజయవంతమవుతుందన్నది కొన్ని రోజులు వేచి చూస్తే కానీ తెలియదు. విజయవంతమైతే గామ్‌లోని ఇతర ప్రాంతాల్లో ఇదే ప్రయోగం చేయనున్నారు. అమెరికా రక్షణ శాఖ 50 కోట్ల రూపాయల బడ్డెట్ లో భాగంగా ఈ ప్రయోగం చేపట్టారు.