భారత్‌కు పరాభవం
► గ్వామ్ చేతిలో 1-2తో ఓటమి
► ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్
టామునింగ్ (గ్వామ్) : ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టుకు అవమానకర ఓటమి ఎదురైంది. కనీసం 2 లక్షల జనాభా కూడా లేని గ్వామ్ అనే చిన్న దీవి జట్టుచేతిలో 1-2 తేడాతో భారత్ పరాజయం పాలైంది. మంగళవారం తమ దేశంలోనే జరిగిన ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అంచనాలు లేని గ్వామ్ చెలరేగింది. గత గురువారం తుర్కెమెనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ గ్వామా 1-0తో గెలిచింది. దీంతో తమ గ్రూప్ ‘డి’లో అగ్రస్థానం దక్కించుకుంది. ఆసియా నుంచి ఫుట్‌బాల్ ఆడుతున్న దేశాల్లో గ్వామ్ అతి చిన్నది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 141వ ర్యాంకులో ఉన్న భారత్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.
భారత్‌కన్నా 33 స్థానాలు వెనుకబడిన గ్వామ్ తరఫున బ్రెండన్ మెక్‌డొనాల్డ్ (38వ నిమిషంలో), ట్రావిస్ నిక్‌లా (62వ ని.) గోల్స్ చేయగా.. భారత్ నుంచి కెప్టెన్ సునీల్ చెత్రి ఇంజ్యూరీ సమయంలో (90+3) ఓదార్పు గోల్ చేశాడు. ఇది చెత్రికి 50వ అంతర్జాతీయ గోల్ కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో ఒమన్ చేతిలో ఓడిన జట్టునే భారత కోచ్ బరిలోకి దించారు. అయితే ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసుకున్న భారత్ తగిన మూల్యం చెల్లించుకుంది.
38వ నిమిషంలో రియాన్ గై లాంగ్ పాస్‌ను అందుకున్న మెక్‌డొనాల్డ్ హెడ్ గోల్‌తో శుభారంభం అందించాడు. ద్వితీయార్ధంలో భారత్ తమ ఆటగాళ్లను మార్చినా ఆటతీరులో మార్పు రాలేదు. 62వ నిమిషంలో తన సోదరుడు షాన్ అందించిన పాస్‌ను నిక్‌లా గోల్ చేసి స్కోరును 2-0కి పెంచాడు. ఇక చిట్టచివర్లో చెత్రి గోల్‌తో భారత్ కాస్త పరువు నిలుపుకుంది.