సియోల్/న్యూజెర్సీ: పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధీనంలో ఉన్న ఓ ద్వీపంపై అణుదాడి చేయడానికి ఉత్తరకొరియా పక్కా ప్రణాళిక రచిస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా పేర్కొంది. ఉత్తరకొరియాకు 2,128 మైళ్ల దూరంలో ఉన్న గువాం ద్వీపంపై దాడి చేయన్నట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉత్తరకొరియాపై చేసిన వ్యాఖ్యలే దాడి నిర్ణయానికి కారణమని వెల్లడించింది.
గువాం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపం. ఈ ద్వీప జనాభా కేవలం ఒక లక్షా అరవై వేలు. దీని తీరంలో అమెరికాకు చెందిన సబ్ మెరైన్ల స్క్వాడ్రన్, ఒక ఎయిర్‌బేస్, కోస్ట్ గార్డు గ్రూప్‌లు ఉన్నాయి. వాటన్నింటిని నాశనం చేసేందుకు పక్కావ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఉత్తరకొరియా చెప్పింది. తమ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ ఆమోదించిన మరుక్షణమే.. గువాంను ప్రపంచపటంలో లేకుండా చేస్తామని ఉత్తరకొరియా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఒక వేళ గువాంపై దాడిని అమెరికా అడ్డుకోదలిస్తే.. ఆ దేశ ప్రధాన భూభాగంపై కూడా బాంబులు వేస్తామని ఉత్తరకొరియా మిలటరీ ప్రతినిధి ఒకరు అన్నారు. ఉత్తరకొరియా తాజా ప్రకటనతో ప్రపంచమార్కెట్లు కుదేలవుతున్నాయి. దీంతో ఆ దేశంపై దుందుడుకుతనంతో వ్యాఖ్యలు చేయొద్దని కంపెనీలు అమెరికాను అభ్యర్థిస్తున్నాయి.
ట్రంప్ ప్రకటన ఏంటంటే..
మంగళవారం న్యూజెర్సీలో విలేకరుల సమావేశంలో ఉత్తరకొరియాపై ట్రంప్ విరుచుకుపడ్డారు. అమెరికాను ఉద్దేశిస్తూ పదేపదే ప్రకటనలు చేయకపోవడం ఆ దేశానికి మంచిదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఉత్తరకొరియా వరుసగా జరుపుతున్న ఖండాంతర అణు సామర్ధ్య క్షిపణుల పరీక్షలను యూఎస్ ఏకగ్రీవంగా ఖండించింది. ఆ దేశానికి వ్యతిరేకంగా ఈ తీర్మానం రావడం వెనుక అమెరికా హస్తం ఉందని ఉత్తరకొరియా బలంగా నమ్ముతోంది.
అణు దాడి చేయనున్న ఉత్తరకొరియా!
Published Wed, Aug 9 2017 8:53 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM
Advertisement