కిమ్ జాంగ్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్ : నిన్న మొన్నటి వరకూ అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. కిమ్ తెలివైన, సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ట్రంప్ అభినందించారు. అమెరికా భూభాగమైన గువామ్ ద్వీపంపై దాడి చేస్తామని గతవారం ఉత్తర కొరియా తీవ్ర హెచ్చరికలు చేయడంతో ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డిన విషయం తెలిసిందే.
అయితే క్షిపణి దాడి విషయంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గింది. క్షిపణి ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని, అమెరికా మరిన్ని నిర్లక్ష్య చర్యలు చేపట్టేంతవరకు వరకు ఎదురు చూస్తామని ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా నిర్ణయంపై స్పందించిన ట్రంప్... కిమ్ తెలివైన నిర్ణయం తీసుకున్నారని పొగడటమే కాకుండా... క్షిపణి దాడి ఆలోచన విపత్కరమే గాక, ఆమోదయోగ్యం కానిది కూడా అని ట్వీట్ చేశారు. దాంతో అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.
Kim Jong Un of North Korea made a very wise and well reasoned decision. The alternative would have been both catastrophic and unacceptable!
— Donald J. Trump (@realDonaldTrump) August 16, 2017