దూసుకెళ్లిన అమెరికా యుద్ధవిమానాలు
వాషింగ్టన్: పసిఫిక్ మహాసముద్రంలోని గువాం ద్వీపం మీదుగా అమెరికా యుద్ధవిమానాలు దూసుకెళ్లాయి. గువాంపై ఉత్తరకొరియా అణుదాడి చేసే ప్లాన్‌ను రచిస్తున్నామని ప్రకటించక ముందే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు సోమవారం అత్యవసరంగా సమావేశం అయ్యాయి. భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దాదాపు 10 గంటల పాటు అమెరికాకు చెందిన సూపర్‌సోనిక్ బాంబర్ జెట్లు గువాం మీదుగా పలుమార్లు గాల్లో చక్కర్లుకొట్టాయి.
దాడి జరిగితే అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకోసమే 10 గంటలపాటు పైలట్లు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. ఉత్తరకొరియా ఆలోచనను ముందుగానే పసిగట్టిన అగ్రరాజ్యం ప్రత్యర్థిని తోకముడిచేలా చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ చూడనివిధంగా అమెరికా విశ్వరూపాన్ని యుద్ధంలో ఉత్తరకొరియా చూస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా వ్యూహానికి అద్దంపడుతున్నాయి. ఈ సమావేశం జరిగిన తర్వాతే ట్రంప్ న్యూ జెర్సీలో ఉత్తరకొరియాపై కామెంట్లు చేశారు. కాగా, గువాం గవర్నర్ అమెరికాను యుద్ధంలో గెలుస్తుందని బుధవారం వ్యాఖ్యానించారు. గువాంపై దాడి చేసేందుకు ఉత్తరకొరియా దాదాపు 60 న్యూక్లియర్ వార్ హెడ్‌లను సిద్ధం చేసిందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.