nuclear strike
-
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై ‘అణు’ ఖడ్గం!
ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి 25 రోజులు గడుస్తున్నా రష్యా పెద్దగా సాధించిందేమీ కన్పించడం లేదు. అమ్ములపొదిలో ఆయుధాలు ఖాళీ అయిపోతున్నాయి. రష్యా సైనికుల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అంతర్జాతీయ ఆంక్షల చట్రంలో ఇరుక్కొని దేశం నలిగిపోతోంది. అధ్యక్షుడు పుతిన్ యుద్ధోన్మాదంపై స్వదేశంలోనే తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఆయన ఓవైపు రాజీమార్గాలను అన్వేషిస్తూనే మరోవైపు దాడులను తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా, మున్ముందు అణు దాడులకూ పాల్పడుతుందేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి... రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి. ఎటూ పాలుపోకపోవడంతో పుతిన్ అసహనంతో రగిలిపోతున్న మాట నిజమేనని స్లేట్ ఆన్లైన్ మ్యాగజైన్ జాతీయ భద్రతా వ్యవహారాల ప్రతినిధి ఫ్రెడ్ కప్లన్ అన్నారు. ‘‘ది బాంబ్: ప్రెసిడెంట్స్, జనరల్స్, అండ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ న్యూక్లియర్ వార్’’ రచయిత అయిన ఆయన రష్యా అణు యుద్ధ భయాలపై లోతైన విశ్లేషణ చేశారు. ‘ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఓటమి అంచుల్లో ఉంది. అంతమాత్రాన పుతిన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తారని అనుకోలేం. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించడానికి నాటో నిరాకరించింది గనుక రష్యా ఆ సాహసం చేయకపోవచ్చు. అమెరికా, నాటో దేశాలు యుద్ధంలోకి నేరుగా ప్రవేశిస్తే అది వేరే సంగతి. వాటిని అడ్డుకోవడానికి రష్యా ఎంతకైనా తెగించవచ్చు. రష్యా, అమెరికా దగ్గర పరస్పరం నామరూపాల్లేకుండా చేసుకోగలిగినన్ని అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి. కానీ వాటిని ప్రయోగించే అవకాశాలు లేవనే చెప్పాలి. రష్యా చిన్న అణు బాంబుల్ని ప్రయోగించినా కనీసం 8 వేల టన్నుల రేడియేషన్ వెలువడి ఊహాతీతమైన విధ్వంసం జరుగుతుంది. అదీగాక అణ్వాయుధాలను వాడే దేశంపై అంతర్జాతీయంగా ఆంక్షలు మరింతగా పెరుగుతాయి. అందుకే 1945 తర్వాత ఏ దేశమూ ఆ సాహసం చేయలేదు. అయినా ఏ దేశం యుద్ధ వ్యూహం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధానికి దిగనంత వరకూ అణు ముప్పుండకపోవచ్చు. అందుకే ఉక్రెయిన్ ఎంత ప్రాధేయపడ్డా నో ఫ్లై జోన్ ప్రకటించకుండా అ మెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. పరోక్ష సాయానికే పరిమితమవుతోంది’’ అని అన్నారాయన. చైనా సహకారం లేకుండా... రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా లేదా అన్నదాన్ని చైనాతో ముడిపెట్టి చూడాలని బ్లూమ్‌బర్గ్ యూరప్ రిపోర్టర్ మారియో టాడియో అన్నారు. ‘‘చైనా నుంచి రష్యాకు ఆశించిన సైనిక తదితర సహకారం అందడం లేదు. పుతిన్ దౌత్య పరిష్కారం కోరుకుంటున్నారు. అణ్వాయుధ ప్రయోగానికి దిగకపోవచ్చు’’ అని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన ఆయుధాలు ► కల్బీర్ క్రూయిజ్ క్షిపణులు: పౌర ప్రాంతాలపై వీటిని విరివిగా ప్రయోగించింది. 2015లో సిరియాలో జరిపిన దాడుల్లోనూ వీటిని వాడింది. ► ఇస్కాండర్ క్షిపణులు: 500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే వీటిని భారీ భవనాలను నాశనం చేయడానికి ప్రయోగించింది. ► రాకెట్ దాడులు: కీవ్‌తో పాటు ఖర్కీవ్, ఒడెశా, చెర్నిహివ్, ఇర్పిన్‌లపై వీటిని భారీగా ప్రయోగిస్తోంది. స్మెర్క్, గ్రాడ్, ఉరకాన్ రాకెట్ లాంఛర్ల ద్వారా వీటిని ప్రయోగించి ధ్వంసరచన చేస్తోంది. ► శతఘ్నులు: అత్యంత శక్తిమంతమైన 203ఎం ఎం పియోని, 152–ఎంఎం హైసింథ్, అకాకియా హొవిట్జర్ శతఘ్నులను ప్రయోగిస్తోంది. ► క్లస్టర్, వాక్యూమ్ బాంబులు: అత్యంత ప్రమాదకరమైన వీటిని జనసమ్మర్ధ ప్రాంతాలపై విస్తృతంగా ప్రయోగించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దూసుకెళ్లిన అమెరికా యుద్ధవిమానాలు
వాషింగ్టన్: పసిఫిక్ మహాసముద్రంలోని గువాం ద్వీపం మీదుగా అమెరికా యుద్ధవిమానాలు దూసుకెళ్లాయి. గువాంపై ఉత్తరకొరియా అణుదాడి చేసే ప్లాన్‌ను రచిస్తున్నామని ప్రకటించక ముందే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు సోమవారం అత్యవసరంగా సమావేశం అయ్యాయి. భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దాదాపు 10 గంటల పాటు అమెరికాకు చెందిన సూపర్సోనిక్ బాంబర్ జెట్లు గువాం మీదుగా పలుమార్లు గాల్లో చక్కర్లుకొట్టాయి. దాడి జరిగితే అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకోసమే 10 గంటలపాటు పైలట్లు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. ఉత్తరకొరియా ఆలోచనను ముందుగానే పసిగట్టిన అగ్రరాజ్యం ప్రత్యర్థిని తోకముడిచేలా చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ చూడనివిధంగా అమెరికా విశ్వరూపాన్ని యుద్ధంలో ఉత్తరకొరియా చూస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా వ్యూహానికి అద్దంపడుతున్నాయి. ఈ సమావేశం జరిగిన తర్వాతే ట్రంప్ న్యూ జెర్సీలో ఉత్తరకొరియాపై కామెంట్లు చేశారు. కాగా, గువాం గవర్నర్ అమెరికాను యుద్ధంలో గెలుస్తుందని బుధవారం వ్యాఖ్యానించారు. గువాంపై దాడి చేసేందుకు ఉత్తరకొరియా దాదాపు 60 న్యూక్లియర్ వార్ హెడ్లను సిద్ధం చేసిందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. -
బటన్ నొక్కితే అమెరికా, కొరియా బూడిదైపోతాయి
ప్యోంగ్ యాంగ్: 'ఒక్క బటన్.. ఒకే ఒక్క బటన్ నొక్కితే మీ రెండు దేశాలు నాశనమైపోతాయి. మమ్మల్ని రెచ్చగొడితే మీపై నిప్పులు కురిపిస్తాం. నిమిషాల్లో మీ నేలను బూడిదగా మార్చేస్తాం. పాతాళంలోకి నెట్టేస్తాం' అంటూ అమెరికా, దక్షిణ కొరియాలను తీవ్రంగా హెచ్చరించింది ఉత్తర కొరియా. తమ దేశంపై యుద్ధానికి తెగబడితే అమెరికా గడ్డపైనేకాక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనూ బీభత్సం తప్పదని కొరిన్స్ పీపుల్స్ ఆర్మీ(కేపీఏ) అధికారికంగా వెల్లడించింది. తమ దేశ సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు సంయుక్తంగా సోమవారం నుంచి చేపట్టనున్న సైనిక కవాతు నేపథ్యంలో ఉత్తర కొరియా చేసిన హెచ్చరికల నడుమ తూర్పు ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏక్షణమైనా యుద్ధం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలంటూ నార్త్ కొరియా నియంత నేత కింగ్ జాంగ్ ఉన్.. తమ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ ద్వారా దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. అమెరికా, సౌత్ కొరియాలు చేపట్టిన సైనిక కవాతును 'పిల్లగుర్రం- రాక్షసగద్ద'ల దుశ్చర్యగా అభివర్ణించిన నార్త్ కొరియా.. ఒకవేళ వారు కవ్వింపు చర్యలకు దిగితే మరుక్షణమే అణుబాంబు దాడులు జరుపుతామంది. ఆ మేరకు ఇప్పటికే సరిహద్దుల్లో అవసరమైన సరంజామా సిద్ధం చేసుకుంది. ఏటా నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా ఇలాంటి హెచ్చరికలు సాధారణమే అయినా కొద్ది రోజుల కిందటే నార్త్ కొరియా అణు, హైడ్రోజన్ బాంబుల్ని పరీక్షించడం, మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి సౌత్ కొరియా, అమెరికాకు చెందిన బలగాలు భారీ ఎత్తున కవాతులో పాల్గొంటుండటం గమనార్హం. కవాతులో సౌత్ కు చెందిన 3 లక్షల బలగాలు, అమెరికాకు చెందిన 15 వేల మంది సైనికులు పాల్గొంటున్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు ఆంక్షలను ఎదుర్కొంటున్న నార్త్ పై ఆదివారం మరికొన్ని షరతులు విధిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నార్త్ కొరియా రాకెట్ ప్రయోగాన్ని తప్పుపడుతూ ఐరాస తాజా ఆంక్షలు విధించింది. కాగా, నార్త్ పై ఐరాస ఆంక్షలను చైనా, రష్యాలు వ్యతిరేకించాయి. నార్త్ కొరియా సరిహద్దుల్లో సౌత్ కొరియా, అమెరికా సైన్యాల కవాతు(ఫైల్ ఫొటో)