బటన్ నొక్కితే అమెరికా, కొరియా బూడిదైపోతాయి
ప్యోంగ్ యాంగ్: 'ఒక్క బటన్.. ఒకే ఒక్క బటన్ నొక్కితే మీ రెండు దేశాలు నాశనమైపోతాయి. మమ్మల్ని రెచ్చగొడితే మీపై నిప్పులు కురిపిస్తాం. నిమిషాల్లో మీ నేలను బూడిదగా మార్చేస్తాం. పాతాళంలోకి నెట్టేస్తాం' అంటూ అమెరికా, దక్షిణ కొరియాలను తీవ్రంగా హెచ్చరించింది ఉత్తర కొరియా. తమ దేశంపై యుద్ధానికి తెగబడితే అమెరికా గడ్డపైనేకాక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనూ బీభత్సం తప్పదని కొరిన్స్ పీపుల్స్ ఆర్మీ(కేపీఏ) అధికారికంగా వెల్లడించింది.
తమ దేశ సరిహద్దుల్లో అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు సంయుక్తంగా సోమవారం నుంచి చేపట్టనున్న సైనిక కవాతు నేపథ్యంలో ఉత్తర కొరియా చేసిన హెచ్చరికల నడుమ తూర్పు ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏక్షణమైనా యుద్ధం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలంటూ నార్త్ కొరియా నియంత నేత కింగ్ జాంగ్ ఉన్.. తమ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ ద్వారా దేశ సైన్యానికి పిలుపునిచ్చారు.
అమెరికా, సౌత్ కొరియాలు చేపట్టిన సైనిక కవాతును 'పిల్లగుర్రం- రాక్షసగద్ద'ల దుశ్చర్యగా అభివర్ణించిన నార్త్ కొరియా.. ఒకవేళ వారు కవ్వింపు చర్యలకు దిగితే మరుక్షణమే అణుబాంబు దాడులు జరుపుతామంది. ఆ మేరకు ఇప్పటికే సరిహద్దుల్లో అవసరమైన సరంజామా సిద్ధం చేసుకుంది.
ఏటా నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా ఇలాంటి హెచ్చరికలు సాధారణమే అయినా కొద్ది రోజుల కిందటే నార్త్ కొరియా అణు, హైడ్రోజన్ బాంబుల్ని పరీక్షించడం, మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి సౌత్ కొరియా, అమెరికాకు చెందిన బలగాలు భారీ ఎత్తున కవాతులో పాల్గొంటుండటం గమనార్హం. కవాతులో సౌత్ కు చెందిన 3 లక్షల బలగాలు, అమెరికాకు చెందిన 15 వేల మంది సైనికులు పాల్గొంటున్నారు.
ఇప్పటికే అంతర్జాతీయంగా పలు ఆంక్షలను ఎదుర్కొంటున్న నార్త్ పై ఆదివారం మరికొన్ని షరతులు విధిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నార్త్ కొరియా రాకెట్ ప్రయోగాన్ని తప్పుపడుతూ ఐరాస తాజా ఆంక్షలు విధించింది. కాగా, నార్త్ పై ఐరాస ఆంక్షలను చైనా, రష్యాలు వ్యతిరేకించాయి.
నార్త్ కొరియా సరిహద్దుల్లో సౌత్ కొరియా, అమెరికా సైన్యాల కవాతు(ఫైల్ ఫొటో)