
సియోల్ : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను రెచ్చగొట్టే చర్యలను అమెరికా మళ్లీ మొదలుపెట్టింది. ఆదివారం ఉదయం దక్షిణ కొరియా సైన్యంతో కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలను చేపట్టింది. ఫోల్ ఈగల్ పేరిట ఏప్రిల్ 8వ తేదీ వరకు ఈ ఆపరేషన్ కొరియా దేశాల సరిహద్దుల్లో కొనసాగనుంది.
ఇందులో 11, 500 అమెరికన్ దళాలు, 2,90,000 దక్షిణ కొరియా దళాలు పాల్గొనబోతున్నట్లు సియోల్‌కు చెందిన యోన్‌హప్ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. అమెరికా ప్రస్తావన పక్కకు పెట్టి ఉత్తర కొరియా పొరుగు దేశం(దక్షిణ కొరియా)తో చర్చలకు సిద్ధమైంది. ఏప్రిల్ చివరి వారంలో కిమ్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో భేటీ కానున్నట్లు ప్యాంగ్ యాంగ్-సియోల్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తాజా డ్రిల్.. కిమ్‌ను మరింతగా రెచ్చగొట్టేదిగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా ప్రతీ యేటా ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో ఈ మిలిటరీ డ్రిల్ కొనసాగాలి. కానీ, వింటర్ ఒలంపిక్స్, పారా ఒలంపిక్స్ నేపథ్యంలో అవి వాయిదా పడ్డాయి. చర్చల ప్రతిపాదన కొనసాగుతున్న వేళ ళీ చర్యలపై ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment