అమెరికాతో సౌదీ భారీ ఆయుధ డీల్
వాషింగ్టన్: సౌదీ అరేబియాకు అత్యాధునిక టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్(థాడ్) క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. థాడ్ ఒప్పందం విలువ 15 బిలియన్ డాలర్లు(రూ. 97 వేల కోట్లు) అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. శక్తివంతమైన రాడార్లు అమర్చిన ఈ థాడ్ క్షిపణులు శత్రు దేశాల క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకుని పేల్చివేస్తాయి. గంటకు 10 వేల కి.మీ వేగంతో ప్రయాణించే థాడ్ క్షిపణులు 150 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎగరగలవు.
‘ఈ ఒప్పందం అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానాలకు సహకారంగా ఉంటుంది. సౌదీ అరేబియా, గల్ఫ్‌లో ఇరాన్‌తో పాటు ఇతర ప్రాంతీయ ముప్పుల నేపథ్యంలో థాడ్ దీర్ఘకాల రక్షణ వ్యవస్థగా ఉపయోగపడుతుంది’ అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే థాడ్‌ను సౌదీ పొరుగు దేశాలైన ఖతర్, యూఏఈలకు అమెరికా సరఫరా చేసింది. అమెరికా ఆయుధ సంపత్తిలో థాట్ అత్యంత సమర్థవంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ. శత్రు క్షిపణుల్ని కచ్చితంగా గుర్తించి పేల్చేందుకు ఇందులో రాడార్ వ్యవస్థలున్నాయి.
20 అడుగుల పొడవుండే థాడ్ క్షిపణులు టన్ను బరువుంటాయి. ఇన్ఫ్రారెడ్ సెన్సర్ల సాయంతో మిస్సైల్‌ను అంచనావేసి పేల్చేస్తుంది. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ నిర్ణయించారు. పాక్‌కు గట్టి హెచ్చరికలు చేసేందుకు విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల్ని పాక్‌కు పంపనున్నారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని ట్రంప్ తప్పుపట్టడం తెలిసిందే. అమెరికా హెచ్చరించినా పాక్ తీరు మారకపోవడంతో ఈ నెల చివరిలో అమెరికా విదేశాంగ మంత్రి పాక్‌కు వెళ్లనున్నారు.
అందుకే ట్రంప్‌తో విడిపోయా
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు సహా పలు ఆసక్తికర అంశాల్ని ఆయన మొదటి భార్య ఇవానా బయటపెట్టారు. ‘రైజింగ్ ట్రంప్’ పేరుతో ఆమె రాసిన పుస్తకంలో ట్రంప్ వివాహేతర సంబంధాల బాగోతాన్ని వివరించారు. 1977లో ట్రంప్‌ను పెళ్లిచేసుకున్న ఇవానా 1992లో విడిపోయారు. ‘మా వివాహ బంధం ముగిసిందని 1989లో∙నాకు అర్థమైంది. ఒక యువతి నా దగ్గరకు వచ్చి తన పేరు మార్లా అని, నా భర్తను ప్రేమిస్తున్నానని చెప్పింది.
నేను వెంటనే బయటకు పో.. నేను నా భర్తను ప్రేమిస్తున్నానని గట్టిగా సమాధానమిచ్చాను’ అని పాత సంగతుల్ని పుసక్తంలో ఇవానా గుర్తుచేసుకున్నారు. మార్లా మేపుల్స్‌తో వివాహేతర సంబంధాన్ని 1990లో న్యూయార్క్ పోస్టు పత్రిక ‘బెస్ట్ సెక్స్ ఐ హావ్ ఎవర్ హాడ్’ పేరుతో ప్రకటించడంతో ట్రంప్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవానాతో విడాకుల తర్వాత 1993లో ట్రంప్ మార్లాను పెళ్లి చేసుకున్నారు. ‘మేమిద్దరం విడిపోయాక పెద్ద కొడుకు డొనాల్డ్ జూనియర్ ఏడాది పాటు తండ్రితో మాట్లాడలేదు. ప్రస్తుతం వారానికోసారి మాట్లాడుకుంటున్నాం. చెక్ రిపబ్లిక్కు రాయబారిగా నాకు చాన్సిచ్చినా వద్దన్నా’ అని పేర్కొన్నారు.