సొంత అస్తిత్వాన్ని వదులుకోవద్దు!
ములాయంకు సూచించిన ఎస్పీ నేతలు
న్యూఢిల్లీ: జనతా పరివార్ కోసం సొంత అస్తిత్వాన్ని వదులుకోవడం సరికాదని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నేతలు పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్కు సూచించినట్టు సమాచారం. బిహార్లో మహా కూటమి నుంచి వైదొలగాలని ఎస్పీ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా వారీ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్లో 2017లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడంపైనే పార్టీ దృష్టి సారించాలని, జనతా పరివార్ ద్వారా జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే శక్తిగా ఎదగాలన్న ప్రణాళికలను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని వారు ములాయంతో పేర్కొన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీలను ఓడించడంపైనే ఎస్పీ దృష్టి కేంద్రీకృతం కావాలని, మహాకూటమిలో భాగమైతే ఇది సాధ్యం కాదని పార్టీ సీనియర్ నేతలు రాంగోపాల్ యాదవ్, మహమ్మద్ ఆజంఖాన్లు నచ్చజెప్ప సఫలీకృతమైనట్టు వివరించాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ దారుణ ఓటమి చవిచూసింది. కేవలం ఐదుసీట్లనే గెలవగలిగింది.