శాంతిభద్రలపై ఎస్పీ ఆరా
- నగరంలో ఆకస్మిక తనిఖీ
- సీఐ, ఎస్ఐలకు తెలియకుండా సుడిగాలి పర్యటన
- పోలీసు గస్తీ విధులపై ఆరా
కర్నూలు: ఏమమ్మా.. మీ కాలనీల్లో పోలీసులు గస్తీ తిరుగుతున్నారా... డయల్ 100కు ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్నారా... మహిళా వేధింపులు, గొలుసు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు వంటి వాటిపై క్యూఆర్‌టీకి ఫోన్ చేస్తే స్పందిస్తున్నారా... ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లడానికి మహిళలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా... అంటూ ఎస్పీ ఆకె రవికృష్ణ ఆరా తీశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నగరంలోని పలు కాలనీల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని గొలుసు నగలు తమ చేతి వాటం ప్రదర్శిస్తుండటంతో పలు చోట్ల వాకింగ్‌కు వెళ్లే మహిళలు, పురుషులను నిలిపి నగరంలో శాంతి భద్రతలప ఆరా తీశారు.
శివారు ప్రాంతాలు లేబర్ కాలనీ, బాలజీనగర్, మమతానగర్, రామలింగేశ్వరనగర్, వెంకటరమణ కాలనీ, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండు ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతలపై ఆరా తీశారు. బీట్ పోలీసులు గస్తీ తిరుగుతున్నారా... సీఐలు, ఎస్ఐలు కాలనీల్లో పర్యటిస్తున్నారా... అంటూ ఆరా తీశారు. కొత్త బస్టాండు దగ్గర రోడ్డుకు అడ్డంగా ఆటోలు నిలపడంతో డ్రైవర్లపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఆటోలను నిలుపుకోవాలని వారికి సూచించారు. రౌడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారా.. అని ఆరా తీశారు.
మద్యం బాబుల ఆగడాలను వేగలేకపోతున్నాం:
మద్యం బాబుల ఆగడాలను వేగలేకపోతున్నాం. ఉదయం 7 గంటలకే మద్యం వ్యాపారులు దుకాణాలను తెరుస్తుండటంతో మద్యం బాబులు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారు. ముందు సైడు షెట్టర్లు మూసి, వెనుకసైడు నుంచి పగలు, రాత్రి తేడా లేకండా మద్యం వ్యాపారాలు కొనసాగిస్తున్నారని బళ్లారి చౌరస్తా ప్రాంతంలో పలువురు మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
రోజురోజుకు ఆటోల సంఖ్య పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని కొంతమంది వాహనదారులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
రాత్రి వేళల్లో శివారు కాలనీల్లో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోయాయని, జాతీయ రహదారికి ఇరువైపులా కూర్చొని మద్యం సేవిస్తుండటంతో నడుచుకుంటూ వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉందని మహిళలు ఫిర్యాదు చేశారు. పాఠశాల మైదానాలు, కేసీ కెనాల్ గట్టుపైన, ఫ్లై ఓవర్ బ్రిడ్జీలపైన మద్యం బాబులు తిష్ట వేసి అర్థరాత్రి వరకు అల్లర్లు చేస్తున్నారని కొంతమంది వాకర్లు ఫిర్యాదు చేశారు.
పోలీసు గస్తీ మరింత పెంచి కఠిన చర్యలు తీసుకుంటామని, సమస్యలు ఏమైనా ఉంటే తనకు గానీ, స్థానిక పోలీసులకు కానీ, డయల్ 100కు కానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ ఆదేశించారు.
శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలపై స్టేషన్లకు వెళ్లినపుడు పోలీసు అధికారులు స్పందిస్తున్నారా.. లేదా అంటూ ఆరా తీశారు. కొంతమంది ఎస్ఐల పనితీరుపై మహిళలు తీవ్రంగా ఫిర్యాదు చేశారు. డబ్బు, పలుకుబడి ఉన్న వారికే అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు.