నిరంతర సాధనతో క్రీడల్లో రాణింపు
కప్పట్రాళ్ల(దేవనకొండ): నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణించవచ్చునని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. ఆదివారం కప్పట్రాళ్ల గ్రామంలో పత్తికొండ జోనల్ స్థాయి క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ, ఆయన సతీమణి పార్వతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడాకారులకు పోరాటపటిమ అవసరమన్నారు. కప్పట్రాళ్ల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నానన్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ రూ.25 లక్షల నిధులతో గ్రామంలో కమ్యూనిటీ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కప్పట్రాళ్లలో ఈనెల 23, 24వ తేదీల్లో తానా ఆధ్వర్యంలో ఉచిత కేన్సర్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు 40 పాఠశాలల నుంచి క్రీడాకారులు తరలిరావడంతో గ్రామానికి కొత్త కళ వచ్చింది. పత్తికొండ పీఈటీ రాజేష్ పీఈటీలపై రచించిన పాటల సీడీలను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, డీఎస్పీ బాబాఫకృద్దీన్, ఎంపీపీ రామచంద్రనాయుడు, జోనల్ చైర్మన్ మరియానందం, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, దేవనకొండ మాజీ సర్పంచ్ ఉచ్చీరప్ప, ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, సీఐలు విక్రమ్‌సింహ, శ్రీనివాస్, ప్రసాద్, ఎంఈఓ యోగానందం తదితరులు పాల్గొన్నారు.