క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోవద్దు
బల్లికురవ: క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోవద్దని గ్రామాల్లో ప్రజలు కక్షలు విడనాడి ప్రశాంతంగా జీవించాలని ఎస్పీ సత్య ఏసుబాబు కోరారు. మే 19న వేమవరం గ్రామంలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఆయన గురువారం గ్రామాన్ని పరిశీలించారు. దాడులు జరిగిన ప్రాంతాలను, గ్రామ మ్యాప్‌ను పరిశీలించారు. తరువాత దాడితో గాయపడిన గోరంట్ల వెంకటేశ్వర్లు, పేరయ్య, వేగినాటి ముత్యాలరావు, వీరరాఘవుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. దాడిలో మరణించిన గోరంట్ల పెద అంజయ్య, వేగినాటి రామకోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
శాంతి భద్రతల విషయంలో పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రాణం విలువ ఎంతో ముఖ్యమైందని, ఘర్షణలతో క్షణికావేశాలకు లోనైతే, ప్రాణాలు పోవడంతోపాటు, కోర్టుల చుట్టూ తిరగడం, జైలు పాలు అవుతారని చెప్పారు. దీనివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయని హెచ్చరించారు. ఒకప్పుడు పల్లెల్లో ఎంతో ప్రశాతం వాతావరణం ఉండేదన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరారు. దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు, అద్దంకి సీఐ హైమారావు, ఎస్సై కట్టా అనూక్ పాల్గొన్నారు.
డీటీసీ పరిశీలన
ఒంగోలు క్రైం: స్థానిక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ–పోలీస్)ని ఎస్పీ బి. సత్య ఏసుబాబు గురువారం పరిశీలించారు. నూతనంగా ఎంపికైన స్టైఫండరీ కానిస్టేబుళ్లకు జూలై నెల 14 నుంచి ఇక్కడ శిక్షణ ఇవ్వనుండటంతో సౌకర్యాల గురించి డీటీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 250 మంది స్టైఫండరీ కానిస్టేబుళ్లు శిక్షణ పొందనున్నారు. సంబంధిత ఏర్పాట్లపై వైస్ ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరెడ్డితో సమీక్షించారు. నైతిక విలువలతో కూడిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎస్బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు తదితర పోలీస్ అధికారులున్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
ఒంగోలు టౌన్: కలెక్టర్ వి. వినయ్‌చంద్‌ను స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కలెక్టర్‌తో భేటీ అయ్యి జిల్లాలో శాంతిభద్రతల గురించి చర్చించారు.