sp tripari
-
గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు : ఎస్పీ త్రిపాఠి
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : గణేశ్ ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. శనివారం స్పెషల్ బ్రాంచ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రణాళిక తయారు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, బందోబస్తు విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఖానాపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, ఉట్నూర్, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టాలని, ప్రధాన కూడళ్ల దగ్గర పీకెటింగ్, ప్రార్థన స్థలాల్లో పోలీసు పహారా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎప్పటికప్పుడు పేకాట స్థావరాలు, క్లబ్‌లపై దాడులు నిర్వహించి జూదాన్ని అరికట్టాలని ఆదేశించారు. కొంతమంది అసాంఘిక శక్తులు చేసే వదంతులు ప్రజలు నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలీసు అధికారులు అందుబాటులో ఉండి స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో యాంటీ సాబోటేజ్ చెకింగ్, వాహనాల తనిఖీలు, సీసీ కెమెరాల ఉపయోగం, పోలీసు వీడియోగ్రాఫర్లను, అనుమానిత ప్రాంతాల్లో బాంబ్ స్వ్కాడ్ల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పోలీసులు సెలవుపై వెళ్లకుండా పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను పూర్తి చేసి ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరిగేలా చూడాలని కోరారు. ఇన్స్పెక్టర్లు కె.సీతారాములు, ఎస్.బాలరాజు, రాగ్యానాయక్, ఎస్సైలు అన్వర్‌ఉల్లాహక్, ఎంఏ కరీం, టీడీ నందన్ , తాజొద్దీన్ పాల్గొన్నారు. -
బాసరలో ఎస్పీ ఆరా
ముథోల్/బాసర, న్యూస్‌లైన్ : బాసరలో ముగ్గురు హత్యకు గురైన సంఘటన స్థలాన్ని ఆదివారం ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. వ్యాపారి ఇంట్లో జరిగిన ఘాతుకం తెలుసుకునేందుకు భైంసా డీఎస్పీ దేవిదాస్ నాగులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వ్యాపారి అశోక్ దంపతుల హతమార్చిన స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ద్వారం వద్ద పొడవాటి కట్టెను స్వాధీనం చేసుకున్నారు. కట్టెతో తలపై మోది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కట్టెకు ఒక వైపున రక్తపు మరకలు ఉన్నాయి. అనంతరం ఒకటవ అంతస్తులోకి వెళ్లి ఎస్పీ అక్కడ పనిచేసే వారితో పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రక్షణ కల్పించండి.. శారదానగర్‌కు వచ్చిన ఎస్పీ త్రిపాఠిని రక్షణ కల్పించాలంటూ కాలనీవాసులు విన్నవించుకున్నారు. ఇలాంటి సంఘటనలతో తమకు ఏమి తోచడం లేదని వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. కాలనీలో ఉండేవారంతా ఐక్యంగా ఉండాలని పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. కాలనీలో ఐక్యంగా ఉంటూ పోలీసులకు సహకరించాలన్నారు. అనంతరం బాసర పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రిపుల్ ఐటీ సందర్శన.. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి బాసర ట్రిపుల్ ఐటిని సందర్శించారు. కళాశాలలో ర్యాగింగ్‌లాంటివి జరగకుండా కళాజాత ప్రదర్శనలతో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని డీఎస్పీ దేవిదాస్ నాగులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాసరలో చదివే విద్యార్థులు ట్రిపుల్‌ఐటిలో పోలీసు ఔట్ పోస్టింగ్ ఏర్పాటు చేయించాలని ఎస్పీని కోరారు. ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులకు పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఈ విషయం పై దృష్టిపెడతామన్నారు.