తీర్మానాలతో సరిపెట్టొద్దు
కర్నూలు రూరల్: సాగు నీటి సలహా మండలి సమావేశాన్ని తీర్మానాలతో సరిపెట్టవద్దని, రైతులకు ప్రయోజనం కలించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షతన ఐఏబీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన తరువాత జిల్లాలో జరిగిన మొదటి సమావేశానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గైర్హాజరయ్యారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీశారు.
అలాగే సాగు నీటి సమస్యలపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మధ్యలోనే నిష్ర్కమించారు. కోస్తా ప్రాంతానికి మేలు చేసే విధంగా శ్రీశైలం నీటి మట్టాన్ని తగ్గించి ప్రభుత్వం కర్నూలు, కడప జిల్లా రైతుల కడుపుకొడుతోందని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సాగుతో కేసీ వాటా నీటిని అనంతపురం జిల్లాకు తరలించేందుకు జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, నీటి పారుదల శాఖ ఛీఫ్ ఇంజినీర్ కాశీ విశ్వేశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీరు ఆర్.నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
తీర్మానాలివే..
* తుంగభద్ర దిగువ కాలువ కింద 30,000 ఎకరాలకు నీరందించాలి.
* బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పులో పేర్కొన్న 400 టీఎంసీల నీటి కేటాయింపును తక్షణం అమలుపరచాలి.
* ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కట్ట ఎత్తును ఎట్టి పరిస్థితుల్లో పెంచరాదు.
* 31/7/2014 నుంచి సుంకేసుల బ్యారేజీ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని కేసీ కాలువకు వదలాలి.
* మాల్యాల నుంచి రెండు పంపుల ద్వారా కేసీ కాలువకు నీళ్లు వదలాలి.
* ఎలెల్సీలో నీటి ప్రవాహం 3000 క్యూసెక్కుల ఉండే విధంగా చూడాలి.
* ఎల్లెల్సీలో 72.00 కి.మీ నుంచి 185.00 కి.మీ వరకు పైప్‌లైన్ వేసి నీటి చౌర్యాన్ని అరికట్టాలి.
* కేటాయించిన 10 టీఎంసీల నీటిని ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పెన్న అహోబిలం రిజర్వాయర్‌కు మళ్లించరాదు.
* వీబీఆర్ ద్వారా తాగునీటి అవసరాల నిమిత్తం తేదీ 31/7/2014 నుంచి 1000 క్యూసెక్కుల నీటిని వదలాలి.
* వెలుగోడు రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు, కి.మీ 0.00 నుంచి 18.00 కి.మీ లైనింగ్ పనులకు తక్షణం ఉత్తర్వులివ్వాలి.
* కేసీ కెనాల్ కింద కర్నూలు జిల్లాలో 1,00,476 ఎకరాలకు, కడప జిల్లాలో 74,912 ఎకరాలకు మొత్తంగా 1,75,388 ఎకరాలకు నీరందించాలి.
* ఆలూరు బ్రాంచి కాలువ ద్వారా ఖరీఫ్‌లో 8,019 ఎకరాలకు నీరందించాలి.
* అవుకు రిజర్వాయర్‌లో అంతర్భాగంగా ఉన్న పాలేరు, తిమ్మరాజు మైనర్ ఇరిగేషన్ చెరువుల కింద గల ఆయకట్టును ఎస్ఆర్బీసీలో చేర్చాలి.
* ఎస్ఆర్బీసీ బ్లాక్‌లో 1 నుంచి 16 బ్లాక్‌లలో ఖరీఫ్‌కు 1,19,057 ఎకరాలకు నీరందించాలి.
* శివభాష్యం సాగర్కింద ఖరీఫ్‌లో 13,000 ఎకరాలకు నీరందించాలి.
* కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలు నగరంలో ఏర్పాటు చేయాలి.
ఆ హక్కు ఎవరు ఇచ్చారు..
శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని 854 అడుగుల నుంచి 789కి తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక ప్రాంతానికి సీఎంలా వ్యవహరిస్తున్నారు. జిందాల్ ప్యాక్టరీ నిర్మించేందుకు భూములు ఇస్తే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన యాజమాన్యంపై మీరు పదేళ్లుగా ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఎస్పీవై రెడ్డిని ప్రశ్నించారు. - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే
సిమెంటు కంపెనీలపై చర్యలు తీసుకోండి
ప్యాపిలి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న దుమ్ము, ధూళి వల్ల సమీపంలోని పొలాలు పంటలు పండటం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పశువులకు మేత మేసేందుకు కూడా గడ్డి మొలచని విధంగా ఆ ప్రాంతం కాలుష్యయుతంగా మారింది. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు.
- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డోన్ ఎమ్మెల్యే
ఆర్డీఎస్‌పై కర్ణాటక పెత్తనం తగదు
ఆర్డీఎస్‌పై కర్ణాటక పెత్తనం చలాయిస్తుంది. ఆర్డీఎస్కు ఉన్న ఐదు స్లూయిజ్‌లు, 19 పైపులలో నాలుగు స్లూయిజ్‌లు 18 పైపులు మూత వేయడంతో దిగువకు నీరు రావడం లేదు. దీనివల్ల పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గడివేముల మండలంలో ఉన్న కేసీ ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సెంట్రల్ ఫోర్స్ ఏర్పాటు చేసైనా మూత వేసిన స్లూయిజ్‌లు, పైపులను తెరిపించి కేసీ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి.
- గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే
జల చౌర్యాన్ని అడ్డుకోవాలి
ఎల్లెల్సీ నీరు చివరి ఆయకట్టకు అందడం లేదు. ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నీరివ్వాలి. కర్ణాటక ప్రాంత రైతులు చేస్తున్న జలచౌర్యాన్ని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి సమావేశంలో తీర్మానాలు చేస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నికల సందర్భంగా ఎల్లెల్సీ జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు పైపులను వేయిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి.
- సాయి ప్రసాద్‌రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే
ఎత్తిపోతలను పూర్తి చేయాలి
గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల పనులు వెంటనే పూర్తి చేసి సాగునీరు అందించాలి. విద్యుత్ సరఫరా సమస్యతో కొన్ని పథకాలు పూర్తయినా మొదలు పెట్టకపోవడం సమంజసం కాదు. చిన్న చిన్న కారణాలతో పనులు చేయడంలో జాప్యం చేస్తున్నారు. పులి కనుమ పథకానికి అవసరమైన భూ సేకరణ పనులు పూర్తి చేసి వీలైనంత త్వరలో సాగునీరు అందించాలి. - -బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే
భూసేకరణ సాకు చూపొద్దు
ఆలూరు నియోజకవర్గ పరిధిలో తాగు, సాగు నీరు సమస్యలు ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లాలో అత్యంత కరువు నెలకొన్న ప్రాంతంగా ఆలూరు గుర్తింపు పొందింది ఆలూరు బ్రాంచ్ కెనాల్ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన నగరడోణ జలాశయం పనులు పూర్తి చేయాలి. భూ సేకరణతో పనులు సాగడం లేదనే సాకుతో అధికారులు తప్పించుకుంటున్నారు.
- గుమ్మనూరు జయరాం, ఆలూరు ఎమ్మెల్యే
పార్టీలకతీతంగా పోరాటం
తుంగభద్ర జలాశయం నుంచి చట్టప్రకారం జిల్లాకు రావాల్సిన నీటి వాటాలో కోత పడుతోంది. దీంతో జిల్లా ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్టీలకతీతంగా తుంగభద్ర జలాల హక్కులపై పోరాడాల్సిన అవసరం ఉంది. కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా కర్ణాటక ప్రభుత్వం అడ్డుగోలుగా ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తోంది. దీనిని అడ్డుకోవాలి.
- జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
నష్టపరిహారం ఇప్పించండి
ఎస్సార్బీసీలో భూములు కోల్పోయిన నియోజకవర్గ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. తక్షణమే వారికి పరిహారం చెల్లించాలి. ఉపాధి చూపిస్తామని భూములు తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మించుకొని పరిహారం చెల్లించలేదు.
- బీసీ జనార్దన్‌రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే