
'పార్టీని వదిలేసినా, వేరే పార్టీలో చేరినా పదవి పోతుంది'
హైదరాబాద్:ఒక పార్టీలో గెలిచిన తరువాత ఆ పార్టీని వీడినా, వేరే పార్టీలో చేరినా పదవి పోతుందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ మాడభూషి శ్రీధర్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదని ఆయన తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన శ్రీధర్.. పార్టీని వదిలేసినా, వేరే పార్టీలో చేరినా పదవి పోవడం ఖాయమన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లో స్పష్టంగా ఉన్నాయన్నారు. రాజ్యాంగలోని పార్టీని రాజకీయ పార్టీగా లేదా లెజిస్లేచర్ పార్టీగా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అందులో అది గుర్తింపు పొందిన పార్టీయా? లేక గుర్తింపుపొందని పార్టీయా అన్న విషయాన్ని పేర్కొనలేదన్నారు. గుర్తింపు ఉన్నా, లేకపోయినా ఇదే నియమం వర్తిస్తుందన్నారు. ఒక పార్టీ నుంచి పోటీచేయడానికి అర్హత ఉన్నప్పుడు...ఆపార్టీని వదిలేసినప్పుడు కూడా అనర్హతలు వర్తిస్తాయన్నారు.