Spain tournament
-
ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నీని భారత మహిళల జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. ఇంగ్లండ్ జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున హోలీ హంట్ ఏడో నిమిషంలో గోల్ చేయగా... భారత జట్టుకు లాల్రెమ్సియామి 41వ నిమిషంలో గోల్ సాధించి స్కోరును సమం చేసింది. చివరి క్వార్టర్లో రెండు జట్లకు రెండు చొప్పున పెనాల్టీ కార్నర్లు లభించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇదే టోర్నీలో పోటీపడుతున్న భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు చేతిలో 1–2తో ఓడిపోగా... నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. -
సైనా, శ్రీకాంత్ శుభారంభం
బార్సిలోనా (స్పెయిన్): టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్... బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21–16, 21–14తో వైవోని లి (జర్మనీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 23–21, 21–18తో శుభాంకర్ డే (భారత్)ను ఓడించాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 18–21, 15–21తో డారెన్ లియు (మలేసియా) చేతిలో ఓడిపోగా... వైగోర్ కోల్హో (బ్రెజిల్)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ మూడో గేమ్‌లో 12–14 స్కోరు వద్ద గాయంతో వైదొలిగాడు. జయరామ్ 21–14, 21–12తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) పై, సమీర్ వర్మ 21–12, 21–9తో క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 10–21, 21–16, 21–17తో క్రిస్టియాన్సెన్–బోయె (డెన్మార్క్) జోడీపై గెలిచింది. -
స్పెయిన్ టోర్నీకి యెండల సౌందర్య
నిజామాబాద్‌స్పోర్ట్స్ : హాకీ జాతీయ మహిళల జట్టు క్రీడాకారిణి యెండల సౌందర్య స్పెయిన్‌లో నిర్వహించనున్న టోర్నీ ఎంపికైంది. ఈనెల 10నుంచి 24వరకు స్పెయిన్‌లో నిర్వహించనున్న టెస్ట్ హాకీ టోర్నీలో పాల్గొననుంది. జిలాకేంద్రానికి చెందిన సౌందర్య తండ్రి ఇటీవలే మరణించడంతో ప్రస్తుతం ఇక్కడే ఉంటోంది. స్పెయిన్ టోర్నీకి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యుల అండతో ఆటకు సిద్ధమైంది. టోర్నీ నిమిత్తం మంగళవారం బయలు దేరనుంది. టోర్నీలో మనదేశంతో పాటు స్పెయిన్, జర్మనీలు తలపడనున్నాయని, ఒక్కో దేశంతో ఆరుసార్లు పోటీ పడనుందని సీనియర్ క్రీడాకారులు తెలిపారు. ఈ పోటీల్లో సౌందర్య రాణించాలని, దేశానికి, ఇందూరుకు మరింత పేరు తీసుకు రావాలని ఆకాంక్షిచారు.