‘స్పీక్ ఏసియా’ సూత్రధారి అరెస్టు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో 24 లక్షల మంది నుంచి రూ. 2,200 కోట్లు వసూలు చేసి పరారైన ‘స్పీక్ ఏసియా’ సూత్రధారి రామ్ సుమిరన్ పాల్ (37) ఎట్టకేలకు చిక్కాడు. గత 28 నెలలుగా పరారీలో ఉన్న పాల్‌ను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో సోమవారం రాత్రి పోలీ సులు అరెస్టు చేశారు. సోదరుడు రామ్ నివాస్ పాల్ తో కలసి సుమిరన్ పాల్ ఆన్లైన్ మార్కెటింగ్ పేరిట మోసాలకు పాల్పడినట్లు చెప్పారు.
సుమిరన్ పాల్‌పై ముంబైలో 8 కేసులతోపాటు ఆంధ్రప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో వైట్‌కాలర్ నేరాలకు సంబంధించి కేసులు నమోదైనట్లు ఢిల్లీ అదనపు పోలీసు కమిషనర్ (క్రైం) రవీంద్ర యాదవ్ తెలిపారు. సింగపూర్, ఇటలీ, బ్రెజిల్ తదితర దేశాల్లో సోదరులిద్దరూ మల్టీలెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) కంపెనీలను ఏర్పాటు చేసి చందాదారులను ఆకర్షించారని...అలా వచ్చిన నిధులతో ఆ తర్వాతి కాలంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని చెప్పారు. ఫైవ్‌స్టార్ హోటళ్లలో సెమినార్లు, ఫంక్షన్లలో బాలీవుడ్ తారల ఆటపాటలను ఏర్పాటు చేసి ఏజెంట్లు ఎక్కువ మంది ప్రజల చేత పెట్టుబడులు పెట్టించేలా ఆకర్షించారని వివరించారు. గోవాలో నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు వచ్చే చందాదారుల కోసం ప్రత్యేక రైలును, రిసార్టులోని బీచ్‌ను అద్దెకు తీసుకున్నారన్నారు.
వివిధ రాష్ట్రాల్లో మోసాల ద్వారా వారు రూ. 2,276 కోట్లు కొల్లగొట్టారన్నారు. సంస్థకు చెందిన 210 బ్యాంకు ఖాతాల్లోని రూ. 142 కోట్లను ముంబైలోని ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఫ్రీజ్ చేసిందని మరో 150 బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తోందన్నారు. కాగా, సుమిరన్ పాల్‌పై నమోదైన కేసుల విచారణ కోసం ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు ఆయన్ను త్వరలో పీటీ వారెంట్‌పై తీసుకెళ్లనున్నట్లు సమాచారం.