ఈ వారం యూట్యూబ్ హిట్స్
పవర్ రేంజర్స్: అఫీషియల్ టీజర్ ట్రైలర్
పవర్ రేంజర్స్ పిల్లలకు ఇష్టమైన టీవీ సీరీస్. ఇప్పుడు అదే సినిమాగా రాబోతోంది. డీన్ ఇజ్రేలైట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సూపర్‌హీరో ఫిల్మ్ టీజర్ యూట్యూబ్‌లోకి అప్లోడ్ అవడం ఆలస్యం హిట్స్ మీద హిట్స్ వచ్చి పడడం మొదలైంది. టీజర్‌ను సహజంగానే సినిమా కోసం ఎదురు చూసేలా ఆసక్తికంగా చిత్రీకరించారు. జాక్. కింబర్లీ (అమ్మాయి), బిల్లీ, ట్రినీ (అమ్మాయి), జాన్సన్ అనే ఐదుగురు హైస్కూల్ విద్యార్థుల్ని వారి గురువు జోర్డాన్.. పవర్ రేంజర్స్గా మార్చి, ఈ ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించే దుష్టశక్తులపైకి పోరాటానికి పంపించడమే స్టోరీ. సినిమా వచ్చే ఏడాది మార్చి 24న రిలీజ్ అవుతోంది.
నిడివి : 2 ని. 20 సె. హిట్స్ : 58,71,123
ప్రిమిటివ్ టెక్నాలజీ: స్పియర్ త్రోయర్
ప్రిమిటివ్ టెక్నాలజీ అనేది యూట్యూబ్‌లో ఒక చానెల్. అందులో అన్నీ ఆదిమానవ విశేషాలు అప్లోడ్ అవుతుంటాయి. అప్పటి వాళ్లు ఎలా ఇళ్లు కట్టుకున్నారు? ఎలా పొయ్యి వెలిగించుకున్నారు? ఎలా జంతువుల్ని వేటాడారు అనే అసక్తికరమై విషయాలెన్నో ఉంటాయి. పేరుకు అవన్నీ విషయాలే కానీ, ఈ ఆధునిక ప్రపంచానికి అవి వింతలు, విడ్డూరాలు. మూడు రోజుల క్రితమే అప్లోడ్ అయిన ఈ వీడియోలో ఆదిమానవుడు ఎలా బల్లెంను తయారు చేసుకున్నాడో, ఎలా బల్లె విసరడం నేర్చుకోన్నాడో చిత్రీకరించారు. ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ కాలంలో ఏదో ఒక సెట్టింగ్ వేసి అసలు ఏ సదుపాయాలూ లేని ఆదికాలం నాటి జీవన విధానాన్ని షూట్ చెయ్యడం తేలిగ్గా అనిపించవచ్చు కానీ, టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లి వెళ్లి, ఆనాటి దృశ్యాలను మనసులో పిక్చరైజేషన్ చేసుకుని కెమెరాలోకి లాగేసుకోవడం అనుకున్నంత తేలికేం కాదు.
నిడివి : 4 ని. 27 సె. హిట్స్ : 28,18,175
కాష్మోరా: అఫీషియల్ ట్రైలర్
కాష్మోరా నవల వచ్చింది. కాష్మోరా సినిమా వచ్చింది. కాష్మోరా ఎలా వచ్చినా భయపెట్టి, బీభత్సం సృష్టించడం మాత్రం ఖాయం. లేటెస్టుగా ఇప్పుడు కాష్మోరా తమిళనాడు నుంచి వస్తోంది. తమిళ ఫిల్మ్‌గా వస్తోంది. కార్తీ, నయనతార, శ్రీదివ్య లీడ్ రోల్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాకు అసలు హీరో సంతోష్ నారాయణ్. సౌండ్ ట్రాక్ అయనదే. కాష్మోరాకే దడ పుట్టించేశాడు. యువ దర్శకుడు గోకుల్ చేతుల మీదుగా తయారైన కాష్మోరా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 28న నిద్రలేస్తోంది. ఏడు జన్మలు ఒకటే ఒక బాణంలా తయారై చెడు సంహరించడం థీమ్. మంత్రాలు, తంత్రాలు, యుద్ధ విద్యలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నాయని ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తోంది.
నిడివి : 2 ని. 9 సె. హిట్స్ : 23,83,267