Special 26 movie
-
అక్షయ్ సినిమా స్ఫూర్తి.. సీబీఐ అధికారులమంటూ..
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్-26 సినిమా (తెలుగులో గ్యాంగ్) స్పూర్తితో ఓ డాక్టరు ఇంటిని సీబీఐ అధికారులమని చెప్పి దోచుకున్నారు దొంగలు. ఈ ఘటన మార్చి 25న ఢిల్లీలోని పితాంపురా ప్రాంతంతో చోటుచేసుకుంది. డాక్టరు ఇంటినుంచి సుమారు రూ. 36 లక్షలు , ఆభరణాలు, విదేశీ కరెన్సీని కాజేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పితాంపురాకు చెందిన డాక్టర్ ప్రియాంక్ అగర్వాల్ శుక్రవారం సాయంత్రం తన తండ్రి, డ్రైవర్‌తో కలిసి క్లినిక్ నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక మహిళతో సహా మరో నలుగురు నిందితులు తాము సీబీఐ అధికారులమంటూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి మొబైల్ ఫోన్లను లాక్కొని, బ్లాక్ మనీ ఎక్కడ అంటూ సోదా చేశారు. అందినకాడికి నగదు, ఆభరణాలు దోచుకున్నారు. డాక్టర్‌కు చెందిన క్లినిక్ దగ్గర కూడా బ్లాక్‌మనీ కోసం వెతకాలనీ.. అతని కారులోనే డాక్టర్ డ్రైవర్ని తీసుకుని అటువైపుగా వెళ్లారు. ఈ తంతంగంపై మొదటి నుంచీ అనుమానంగానే ఉన్న డాక్టర్ కారు డ్రైవర్.. వారు ప్రయాణిస్తున్న వాహనం మౌర్య ఎన్క్లేవ్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోగానే గట్టిగా కేకలు వేశాడు. దీంతో అక్కడ విధుల్లో పోలీసులు అప్రమత్తమై.. కారుని ఆపు చేయించారు. కారులో ఉన్న నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. కారు వెంబడిస్టూ వచ్చిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధితుడు డాక్టర్ ప్రియాంక్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితులు హర్యానాకు చెందిన బిట్టు( 32), సురేందర్ ( 35), విభ (35), అమిత్, పవన్ గా గుర్తించారు. అక్షయ్‌కుమార్ నటించిన స్పెషల్-26 సినిమా చూసి చోరికి పాల్పడ్డమని నిందితులు చెప్పినట్టు తెలిసింది. నిందితుల వద్ద నుంచి నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకొని, బాధిత కుటుంబానికి అప్పగించామని పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వాయువ్య మండల డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఉష రంగ్నాని తెలిపారు. -
అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అఖిలప్రియ అండ్ గ్యాంగ్ సినిమా తరహాలో కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది. భార్గవ్ సోదరుడు చంద్రహాస్ కిడ్నాప్‌కు ముందు అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ అనే సినిమాని అఖిలప్రియ అండ్ గ్యాంగ్‌కు చూపెట్టాడు. అలానే ఐటి అధికారులుగా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్లో చంద్రహాస్, అఖిలప్రియ అండ్ గ్యాంగ్‌కి కిడ్నాప్‌కు సంబంధించి శిక్షణ ఇచ్చాడు. ఇక అఖిలప్రియ ఆదేశాలకు అనుగుణంగానే అక్షయ్ కుమార్ సినిమా చూపెట్టి కిడ్నాప్ చేయించినట్లు భార్గవ్, చంద్రహాస్ తెలిపారు. అలానే ఐటి అధికారుల చెకింగ్ డ్రెస్సులు, ఐడి కార్లను చంద్రహాస్ తయారు చేశాడు. శ్రీ నగర్ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారుల డ్రెస్‌లను వీరు అద్దెకు తీసుకున్నారు. (చదవండి: పోలీసుల అదుపులో భార్గవ్‌రామ్!?) -
‘ఆ నలుగురి’ తో స్పెషల్ 26 రీమేక్
బాలీవుడ్లో మంచి విజయాన్ని సాధించిన స్పెషల్ 26 చిత్రం ఇప్పుడు దక్షిణాది భాషల్లో మరింత స్పెషల్‌గా తయారవడానికి సిద్ధమవుతోందన్నది తాజా వార్త. సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు త్యాగరాజన్ ఈ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఈయన మరో బాలీవుడ్ హిట్ చిత్రం క్వీన్ హక్కులను పొందారు. తాజా చిత్రం స్పెషల్ 26 రీమేక్‌లో దక్షిణాది భాషలకు చెందిన నలుగురు ప్రముఖ హీరోలు అజయ్‌దేవగన్ పాత్రను పోషించనున్నారు. తమిళంలో ప్రశాంత్, తెలుగులో రవితేజ నటించనున్నారని త్యాగరాజన్ తెలిపారు. కన్నడ, మలయాళ భాషలలో దర్శన్, దిలీప్‌లు నటించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వారితో చర్చలు జరుపుతున్నట్లు మరో రెండు రోజుల్లో ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. హిందీలో మనోజ్‌భాజ్‌పాయ్, అనుపమ్ఖేర్లు పోషించిన పాత్రలను తమిళంలో ప్రకాష్‌రాజ్, సత్యరాజ్ పోషించనున్నట్లు తెలిపారు. వీరితో పాటు నాజర్, షియాజి షిండే, ఎంఎస్ భాస్కర్, రావు రమేష్, బ్రహ్మాజి, హేమ, తులసి తదితరులు నటించనున్నారని వెల్లడించారు. ఇక హీరోయిన్గా దక్షిణాదిలోని ప్రముఖ నటిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆమె ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తానన్నారు. బాలీవుడ్ దర్శకుడు నీరజ్ఫాండే తొలి చిత్రం వెడ్నెస్డే చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని త్యాగరాజన్ అన్నారు. మంచి సోషల్ మెసేజ్ వున్న ఆ చిత్రం రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నించగా అప్పటికే అవి అమ్ముడైపోయినట్లు తెలిసిందన్నారు. అదే దర్శకుడు తెరకెక్కించిన ఈ స్పెషల్ 26 వైవిధ్య భరిత థ్రిల్లర్ కథతో రూపొంది మంచి విజయాన్ని సాధించడంతో దీన్ని రీమేక్ హక్కులు పొందినట్లు త్యాగరాజన్ వివరించారు.