స్పెషల్ 26లో త్రిష
వివాహ నిశ్చితార్థం జరుపుకుని పెళ్లి ఎప్పుడు అనే వాళ్ల నోళ్లకు తాళం వేసింది త్రిష. నిశ్చితార్థం అయింది కాబట్టి త్వరలో పెళ్లి కూడా చేసేసుకుంటారని అనుకునే వాళ్లను ఈ చెన్నై చిన్నది సందిగ్ధంలో పడేసింది. ఎన్నై అరిందాల్ చిత్రంలో చాలా కొత్తగా కనిపించిన త్రిష ప్రస్తుతం జయం రవి సరసన అప్పాటక్కర్ చిత్రంలో నటిస్తున్నారు. అదే హీరోతో నటించిన భూలోకం చిత్రం విడుదలకు ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు తాజాగా, భోగి చిత్రం లోనూ, తెలుగులో బాలకృష్ణ సరసన లయన్ చిత్రంలోను నటిస్తున్నారు.
ఈ చిత్రాల ను ముగించుకుని పెళ్లికి సిద్ధం అవుతారని చాలా మంది ఊహించారు. అయితే, త్రిష తాజాగా మరో కొత్త చిత్రాన్ని అంగీకరించి ఎవరికీ అర్థం కాకుండా పోయారు. బాలీవుడ్లో మంచి విజయం సాధించిన స్పెషల్ 26 చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ దర్శక నిర్మాత, నటుడు త్యాగరాజన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆయన తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ప్రశాంత్, తెలుగులో రవి తేజ, కన్నడంలో పునిత్ రాజ్‌కుమార్ హీరోలుగా నటించనున్నట్టు సమాచారం. దీనికి ఈ మూడు భాషల్లోను ప్రాచుర్యం కల్గిన త్రిషను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.
ఈ అమ్మడు తమిళం, తెలుగు భాషల్లో పాపులర్ హీరోయిన్. ఈ మధ్యనే కన్నడంలో పవర్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం అక్కడ హిట్ కావడంతో స్పెషల్ 26 చిత్రంలో త్రిషకు ఓకే చెప్పినట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే స్పెషల్ 26 హిందీ వర్షన్లో అక్షయ్ కుమార్‌కు హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించి గ్లామర్‌లో దుమ్ము రేపారు. దక్షిణాదిలో అదే పాత్ర లో నటించనున్న త్రిష కూడా అందాల ఆర బోతలో తగ్గేది లేదంటూ నిర్మాతకు హామీ ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్.