140 మంది చోదకులు!
నెక్లెస్‌రోడ్‌లో ఎడాపెడా ట్రాఫిక్ ఉల్లంఘనలు
దృష్టి సారించిన మధ్య మండల పోలీసులు
ఆదివారం భారీ {పత్యేక డ్రైవ్ నిర్వహణ
రామ్‌గోపాల్‌పేట/ఖైరతాబాద్: నెక్లెస్‌రోడ్... ఎన్టీఆర్ మార్గ్... ట్యాంక్‌బండ్... హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న ఈ మూడు ప్రాంతాలూ పర్యాటకులు, వాకర్లు, సైక్లింగ్ చేసే వాళ్లతో కళకళలాడుతుంటాయి. ఇది ఓ కోణమైతే... ఈ ఏరియా ట్రాఫిక్ ఉల్లంఘనులకూ నెలవుగా మారడం మరో కోణం. ఒకే వాహనంపై ముగ్గురు నలుగురు ప్రయాణించడం, మితిమీరిన వేగంతో దూసుకుపోవడం, మైనర్లూ డ్రైవింగ్ చేసేయడం సర్వసాధారణం. ఇది ఒక్కోసారి వాహనచోదకులు, వాటిపై ఉన్న వారితో పాటు అభంశుభం తెలియని వాకర్ల ప్రాణాల మీదికి తెస్తోంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి కట్టడి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్పెషల్‌డ్రైవ్‌తో కొరడా ఝుళిపించారు.
130 మంది పోలీసులతో డ్రైవ్...
సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలో సాగిన ఈ డ్రైవ్‌లో ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, పది మంది ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, ట్రాఫిక్ విభాగం అధికారులతో సహా దాదాపు 160 మంది పాల్గొన్నారు. త్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, మైనర్ డ్రైవింగ్ తదితర నిబంధనల్ని ఉల్లంఘించిన 102 వాహనాలను పట్టుకున్నారు. వీటిపై ప్రయాణించిన 140 మంది చోదకులనూ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 51 మంది మైనర్లు, 20 రేసింగ్ వాహన చోదకులు, 31 మంది ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారు చిక్కారు. మైనర్లలో కొంత మంది 12, 13 ఏళ్ల బాలలు కూడ ఉండటంతో పోలీసులే అవాక్కయ్యారు.
తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్...
ఈ స్పెషల్‌డ్రైవ్‌లో చిక్కిన వాహనచోదకులకు జరిమానా విధించడంతో పాటు డీసీపీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేపట్టారు. వాహనాలు నడుపుతూ చిక్కిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రుల్నీ పిలిపించి మందలించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాల వివరాలతో పాటు నడిపిన వారి వివరాలనూ క్రోడికరిస్తూ డేటాబేస్ రూపొందిస్తున్నారు. ఇకపై క్రమం తప్పకుండా నిర్వహించే స్పెషల్‌డ్రైవ్స్‌లో చిక్కిన వారి వివరాలను ఈ డేటాబేస్‌తో సరిచూడాలని నిర్ణయించారు. ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలా చిక్కిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. పాదచారులు, పర్యాటకులకు భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.