సికింద్రాబాద్, కాకినాడల మధ్య వారాంతపు రైలు
సంగడిగుంట(గుంటూరు), న్యూస్‌లైన్: గుంటూరు మీదుగా శుక్ర, శని, అది, సోమ వారాల్లో సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య జన్ సదరన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నారు. నంబరు 07101 సికింద్రాబాద్‌లో శుక్రవారం రాత్రి 22.40 గంటలకు బయలుదేరి శనివారం తెల్లవారుజాము 04.40 గుంటూరుకు వచ్చి 11.00 గంటలకు కాకినాడు టౌన్ స్టేషన్‌కు చేరుతుంది.
అదే రైలు ఆదివారం సాయంత్రం 19.15 గంటలకు కాకినాడ టౌన్ స్టేషన్ నుంచి బయలు దేరి మరుసటిరోజు అర్ధరాత్రి 02.00 గంటలకు గుంటూరు వచ్చి అదేరోజు ఉదయం 09.45 గంటలకు సికింద్రాబాద్ చేరనుంది. ఈ రైల్లో 14 సాధారణ, రెండు స్లీపర్ క్లాస్ బోగీలుంటాయి. ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ తెలిపారు.
రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
గుంటూరు - తెనాలి రైల్వేస్టేషన్ల మధ్య రైలు మార్గాన్ని పటిష్టపరిచే పనులను వాయిదా వేస్తున్నట్లు రామకృష్ణ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో గుంటూరు - తెనాలి రైలు స్టేషన్ల మధ్య మూడు నెలలపాటు రద్దు చేసిన నంబరు 77282 తెనాలి-గుంటూరు, నంబరు 67255 గుంటూరు-తెనాలి ప్యాసెంజరు రైళ్లను యధావిధిగా నడపనున్నట్లు పేర్కొన్నారు. నంబరు 77223 రేపల్లె-గుంటూరు, నంబరు 77224 గుంటూరు - రేపల్లె రైళ్లను గుంటూరు - రేపల్లెల మధ్య యధావిధిగా నడపనున్నట్లు తెలిపారు.
జూన్ 15వరకూ కొనసాగనున్న
అదనపు ఏసీ బోగీలు
ప్రయాణికుల రద్దీ కారణంగా గుంటూరు - వికారాబాద్ - గుంటూరు నం : 12747/12748 పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో మే నెలాఖరు వరకూ ఏర్పాటు చేసిన రెండు ఏసీ అదనపు బోగీలను జూన్ 15 వరకూ కొనసాగిస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సి.రామకృష్ణ తెలిపారు.