కాల్ ట్యాక్సీకి కళ్లెం!
* ప్రత్యేక మీటర్లు తప్పనిసరి
* చార్జీల నిర్ణయం ప్రభుత్వానికి అప్పగించాలి
* హైకోర్టులో పిటిషన్
సాక్షి, చెన్నై: ఇష్టారాజ్యంగా సాగుతున్న కాల్ ట్యాక్సీల చార్జీలకు కళ్లెం వేయడమే లక్ష్యంగా మద్రాసు హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. ప్రత్యేకంగా మీటర్లు అమర్చాలని, చార్జీల నిర్ణయూన్ని ప్రభుత్వానికి అప్పగించేలా ఆదేశించాలన్న పిటిషనర్ వాదనను మద్రాసు హైకోర్టు బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. ఇందుకు తగ్గ పరిశీలనకు ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని రంగాల్లో దూసుకెళుతున్న రాజధాని నగ రం చెన్నైలో రవాణా వ్యవస్థ కీలకంగా మారింది. రవాణా పరంగా ప్రభుత్వ బస్సులు, ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్ రైల్వే మార్గాలు ఉన్నా, ఆటోలను, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే వాళ్లూ అధికమే.
ఆటోల దోపిడీకి కళ్లెం వేసే రీతిలో గత ఏడాది మీటర్లు తప్పని సరి అయ్యాయి. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలను ఆటో వాలాలు వసూలు చేసే విధంగా పోలీసు యంత్రాంగం కొరడా ఝుళిపిస్తోంది. ఇక, ఆటోలకు దీటుగా నగరంలో కాల్ ట్యాక్సీల సేవలు విస్తృతమయ్యాయి. ప్రైవేటు ట్యాక్సీ ట్రావెల్స్‌కు కాలం చెల్లి కాల్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫోన్ కొడితే చాలు ఎక్కడకు రమ్మంటే అక్కడకు ఏ మోడల్ వాహనం అయినా సరే ప్రయాణికుడి ముందు ప్రత్యక్షం అవుతుంది.
కొన్ని స్థానిక కంపెనీలతో పాటుగా మరికొన్ని విదేశీ సంస్థలు సైతం ఈ కాల్ ట్యాక్సీ సేవలకు శ్రీకారం చుడుతున్నారుు. ఈ సేవలు వేలాది మంది డ్రైవర్లకు ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నా, ఆయా సంస్థలు ఇష్టారాజ్యంగా తమకు తోచినంతగా కిలో మీటరుకు చార్జీలను, ముందుగా నామ మాత్రపు రుసుంను నిర్ణయిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇందుకు ఆయా సంస్థలు ఇచ్చే సమాధానం వాహనాల్లో తాము కల్పించిన సౌకర్యాలు, తాము అందించే సేవలను బట్టి వసూలు చేస్తామని. చెన్నైకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాల్ ట్యాక్సీలకు కళ్లెం వేయూలంటూ గురువారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
పిటిషన్: కాంచీపురం జిల్లా ఉరపాక్కంకు చెందిన సంజీవ నాథన్ ఉదయం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రధాన నగరాల్లో కాల్ ట్యాక్సీ సేవల గురించి వివరించారు. ఈ ట్యాక్సీలతో ఉపాధి అవకాశాలు పొందుతున్న విధానాన్ని విశదీకరించారు. అయితే, ఈ కాల్ ట్యాక్సీ రంగంలోకి విదేశీ సంస్థలు సైతం పాదం మోపినట్టు వివరించారు. స్వదేశీ, విదేశీ సంస్థలు తమ సేవల్ని అందిస్తూనే, వినియోగ దారుడి వద్ద కిలో మీటరుకు అయ్యే చార్జీలతోపాటుగా సేవా పన్నును వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ సేవా పన్ను ప్రభుత్వానికి అందుతోందో లేదోనన్నది ప్రశ్నార్థకమేనని అనుమానం వ్యక్తం చేశారు. ఏ కాల్ ట్యాక్సీలోను చార్జీలకు సంబంధించిన బిల్లులు ఇచ్చిన సందర్భాలు లేవన్నారు. ఆయా సంస్థలు తమకు తోచినట్టుగా చార్జీలను వసూలు చేస్తూ, ప్రయూణికుల మీద భారాన్ని వేస్తున్నాయన్నారు. ప్రస్తుతం కాల్ ట్యాక్సీల సేవలు రాష్ట్రంలో విస్తరిస్తున్న దృష్ట్యా, ఆటోల తరహాలో ఈ కాల్ ట్యాక్సీలకు చార్జీల నిర్ణయం బాధ్యతల్ని ప్రభుత్వానికి అప్పగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వాహనాన్ని విని యోగించుకునే ప్రయాణికుడు సులభతరంగా తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా మీటర్లు అమర్చే రీతిలో చర్యలకు ఆదేశించాలని కోరారు. అన్ని సంస్థలు ఒకే రకంగా చార్జీల్ని అమలు పరిచే విధంగా, ఇందుకు తగ్గ అన్ని చర్యలు తీసుకునే అధికారం చేతిలోకి తీసుకోవాలని కోరుతూ తాను ఇదివరకు ప్రభుత్వానికి విన్నవించానని అయితే, ప్రభుత్వం నుంచి స్పందన లేని దృష్ట్యా, కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
పరిగణనలోకి పిటిషన్: ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు సత్యనారాయణ, మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరపున న్యాయవాది వల్లి దాసు హాజరై వాదనల్ని విన్పించారు. పిటిషన్ పేర్కొన్న అనేక సూచనల్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ పేర్కొన్నట్టుగా చార్జీల నిర్ణయం బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకోచ్చుగా? అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పిటిషనర్ పేర్కొన్న అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, అందుకు తగ్గ పరిశీలనలు చేపట్టాలని రవాణా శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను తేదీ ప్రకటించకుండా వాయిదా వేసింది.