నిరంతర విద్యుత్‌కు సన్నద్ధం
- ‘మోడెం’తో సిబ్బంది సాకులకు చెక్
నర్సీపట్నం టౌన్ : విద్యుత్ అంతరాయాన్ని చిటికెలో తెలుసుకోవడానికి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) మోడెం విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 2 నుంచి గృహ, వ్యవసాయ అవసరాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. సరఫరాలో అంతరాయానికి కారణాలను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందుకోసం ప్రత్యేకంగా మోడెం వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సరఫరా నిలిచిపోయే పరిస్థితికి ఈ వ్యవస్థ చెక్ పెడుతుంది. సిబ్బంది వివిధ సాకులు చూపి కోతలు విధించడానికి అవకాశం ఉండదు. మోడెం విధానం ద్వారా కారణాన్ని తెలుసుకొని ప్రశ్నించడానికి వీలుంటుంది. ఇప్పటికే ఈ విధానం నర్సీపట్నం మున్సిపాలిటీలో అమలవుతోంది. రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని పూర్తి చేశారు.
ఈపీడీసీఎల్ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయడం ద్వారా పట్టణంలో విద్యుత్ సరఫరా ఉన్న సమయం, లేని సమయం నమోదవుతుంది. విద్యుత్ ఉపకేంద్రాల్లో ఉన్న ఫీడర్లకు ప్రత్యేక మీటర్లు, సిమ్‌కార్డులు ఉన్న మోడెంలను అమర్చారు. దీంతో ఇవి ఇప్పటికే అన్‌లైన్‌లో అనుసంధానమై సరఫరా వివరాలు అందుబాటులోకి వచ్చాయి.
నర్సీపట్నం డివిజన్‌లోని 14 మండలాల్లో 2.20 లక్షల కనెక్షన్‌లున్నాయి. వీటిలో గృహ వినియోగ కనెక్షన్లు లక్షా 92 వేలు, వాణిజ్య కనెక్షన్లు 13,500, పరిశ్రమలు 837, వ్యవసాయ 14,200 కనెక్షన్లకు 110 ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీతో పాటు గొలుగొండ, నాతవరం, కోటవురట్ల, ఎస్.రాయవరం, మాకవరపాలెం, రోలుగుంట, రావికమతం, చీడికాడ, వడ్డాది, కొయ్యూరు. చోడవరం, కె.కోటపాడు, మాడుగుల, మోడెం విధాన పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్త నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తారు. అక్టోబర్ 2 నుంచి డివిజన్‌లో నిరంతర విద్యుత్ సరఫరాకు సన్నద్ధమవుతున్నామని డివిజనల్ ఇంజినీర్ ఎన్.రమేష్ తెలిపారు.