ఎస్సీ, ఎస్టీల పట్ల ఇంత అన్యాయమా? | SCs and STs in the so unfair? | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల పట్ల ఇంత అన్యాయమా?

Published Tue, Apr 5 2016 1:30 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM

ఎస్సీ, ఎస్టీల పట్ల ఇంత అన్యాయమా? - Sakshi

ఎస్సీ, ఎస్టీల పట్ల ఇంత అన్యాయమా?

♦ పేదల ఇళ్లకు భారీ మొత్తంలో విద్యుత్ బిల్లులా?
♦ ప్రభుత్వ తీరుపై విపక్ష నేత వైఎస్ జగన్ ఆగ్రహం
♦ ఇంటికి రూ.10 వేల నుంచి 15 వేల బిల్లు వేస్తే ఎలా బతకాలి
♦ 50 యూనిట్లు ఉచితమంటూనే.. పేదల నడ్డి విరుస్తున్నారు
♦ ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

 సాక్షి, కడప: ఒక ఇంటికి విద్యుత్ బిల్లు రూ.15,100, మరో ఇంటికి రూ. 14 వేలు, ఇంకో ఇంటికి రూ. 12,200.. ఇది ఫ్రిజ్‌లు, గీజర్లు, ఏసీలు వాడే ఇళ్లకు వచ్చే బిల్లు అనుకున్నారా? ఒక గిరిజన గ్రామంలో నిరుపేదలకు వచ్చిన బిల్లులు అంటే నమ్ముతారా? ఇది నమ్మాల్సిందే.. ఎందుకంటే ఆ గిరిజనులు తమకు వచ్చిన విద్యుత్ బిల్లులను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చూపించి.. ప్రభుత్వం తమకు చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. సోమవారం సాయంత్రం వైఎస్ జగన్ పులివెందుల వచ్చారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో పులివెందుల మండలంలోని కనంపల్లె ఎస్టీ కాలనీకి చెందిన సుమారు 70 మందికిపైగా గిరిజనులు వచ్చి కలిశారు. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఉచితమంటూనే అధిక కరెంటు బిల్లులు అందించి వేధిస్తున్న వైనాన్ని.. కరెంటు కట్ చేసిన తీరును వివరిస్తూ తమకు అండగా నిలవాలంటూ వైఎస్ జగన్‌కు మొరపెట్టుకున్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూనే భారీగా బిల్లులు వేసి పేద ప్రజల నడ్డివిరుస్తున్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 యూనిట్లపై ఒక్క యూనిట్ దాటినా కరెంట్ వాడకం మొదలు పెట్టినప్పటి నుంచి బిల్లు అంతా కట్టాలనడం దారుణమన్నారు. ఇలా అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు.

ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడతామని.. న్యాయం జరిగే వరకు ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొండ ప్రాంతంలో ఉన్న కనంపల్లెలో పట్టపగలే పాములు, తేళ్లు రోడ్లపై కనిపిస్తుంటాయని.. అలాంటి గ్రామంలో వీధిలైట్లను కూడా తొలగిస్తే ప్రజలు ఎలా జీవించాలని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కనంపల్లె గ్రామంలో దాదాపు 71 మీటర్లు ఉన్నాయని, ఒక్కొక్క మీటరును పరిశీలిస్తే రూ.10,500, రూ. 15,100, రూ. 12,200, రూ. 14 వేలు, రూ. 5 వేలు, రూ. 4,300, రూ. 10 వేలు, రూ. 10,220, రూ. 5,485, రూ. 4,030, రూ. 4,070 ఇలా బిల్లులు వచ్చాయని తెలిపారు. ఇన్ని వేల రూపాయలు బిల్లులు వస్తే కూలి పనులకు వెళ్లేవారు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు.

 ఉచితమంటూనే భారీగా బిల్లులా..
 ఒక్కొక్క ఇంటికి 50 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు వైఎస్‌ఆర్ హయాం నుంచి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తోందని.. ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నామంటూనే పేదల నడ్డి విరుస్తోందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా 50 యూనిట్లు దాటి.. ఒక్క యూనిట్ అధికంగా వచ్చినా.. కరెంటు వాడకం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ బిల్లంతా కట్టాలని ట్రాన్స్‌కో అధికారులు చెప్పడం ఏమిటన్నారు.

ఏ మాత్రం ఆలోచన లేకుండా.. గ్రామంలో వీధిలైట్లను తొలగించి వెళ్లారని చెబుతుంటేనే బాధేస్తోందని.. విష పురుగులు కుట్టి గిరిజనులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆయన నిలదీశారు. ఎస్సీ, ఎస్టీలపట్ల ఇంత అన్యాయంగా ప్రభుత్వం ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడతానని, రెండు రోజులపాటు ఇక్కడే ఉంటానని, ఈలోపు సరిదిద్దితే ఫర్వాలేదు.. లేకపోతే ఏమి చేయాలో ఆలోచన చేసి ఆందోళన చేద్దామని గ్రామస్తులతో వైఎస్ జగన్ చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిద్దామని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంలో ప్రతిపక్షనేత వెంట కడప ఎంపీ వైఎస్ అవినా్‌శరెడ్డి తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement