సర్కారే జగమొండి
► విద్యుత్ బిల్లులు చెల్లించని ప్రభుత్వ విభాగాలు
► స్థానిక సంస్థల్లో రూ.కోట్లల్లో బకాయిలు
► అప్పుల ఊబి నుంచి తేరుకోలేకపోతున్న ‘ఏపీఈపీడీసీఎల్’
► ప్రభుత్వ నిర్వాకంతో సామాన్యులపై ఛార్జీల భారం
► ఫిబ్రవరి నాటికి చెల్లించాల్సిన బిల్లులు రూ.452.82 కోట్లు
► మార్చి నాటికి చెల్లించిన బకాయిలు రూ.5.23 కోట్లు మాత్రమే
సాక్షి, విశాఖపట్నం : అప్పుల ఊబిలో కూరుకుపోయామని, చార్జీలు పెంచకపోతే కుదరదని విద్యుత్ సంస్థ ప్రజలపై భారం మోపడం వెనుక అన్ని ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం దాగి ఉంది. తన వైపు నుంచి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం విద్యుత్ బిల్లుల బకాయిలు విడుదల చేయకుండా డిస్కంను నష్టాల్లోకి నెట్టేస్తోంది. తన తప్పు సరిచేసుకోవడం మానేసి విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై భారం వేస్తోంది. నిజానికి ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లిస్తే డిస్కంకు అసలు, వడ్డీ అంటూ కోట్లాది రూపాయల ఆదాయం సమకూరి ఉండేది.
ఐదు సర్కిళ్లల్లో రూ.452.82 కోట్ల బకాయిలు
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర కలిపి మొత్తం ఐదు జిల్లాలున్నాయి. వీటిలో ఏలూరు సర్కిల్‌లో రూ.151.46 కోట్లు, రాజమండ్రి సర్కిల్‌లో రూ.131.65 కోట్లు , శ్రీకాకుళం సర్కిల్‌లో రూ.56.39 కోట్లు, విశాఖ సర్కిల్‌లో రూ 84.99 కోట్లు, విజయనగరం సర్కిల్‌లో రూ.28.33 కోట్లు మొత్తం 452.82 కోట్ల మేర విద్యుత్ బకాయిలు గత నెల నాటికి ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సి ఉంది. వాటిలో ఈనెల ఇప్పటి వరకూ కేవలం రూ.5.23 కోట్లు మాత్రమే వసూలైంది. మిగతా రూ.447.59 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
వీటిలోనూ పలు శాఖలు విద్యుత్ బిల్లుల బకాయిలు లేకుండా చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నాయి. మైనారిటీ వెల్ఫేర్ విభాగం ఒక్క రూపాయి కూ డా విద్యుత్ బకాయిలు ఉంచుకోలేదు. సీజీ యూ, ఇండస్ట్రీస్, కామర్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగాలు తమ బిల్లులు చెల్లించేయడంతోపాటు విద్యుత్ శాఖ వద్దనే తమ అడ్వాన్సు సొమ్ము ఉండేలా చూసుకుంటున్నాయి.